ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నా..

DK Shivakumar Slams BJP Over Jesus Statue in kanakapura - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ స్పందించారు. విగ్రహ ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. స్థానికులకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు శివకుమార్‌ తెలిపారు. కాగా శివకుమార్‌ తన సొంత నియోజకవర్గం కనకపురలోని హరొబెళలో పదెకరాల భూమి కొని అతి ఎత్తైన  ఏసుక్రీస్తు విగ్రహం ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా విగ్రహానికి పునాది వేశారు. అయితే ఆ విగ్రహాన్ని శివకుమార్‌ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం లేదని, అది సామాజిక అవసరాలకు ఉద్దేశించిందని రెవెన్యూశాఖ మంత్రి తెలిపారు. ఈ భూమిని శివకుమార్‌ కొనుగోలు చేయడంపై విచారణ జరపాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

ఈ విమర్శలపై శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో క్రీస్తు విగ్రహం లేనందున  హరొబెళలో ఏసుక్రీస్తు విగ్రహం కావాలని స్థానికులు నన్ను కోరారు. నేను సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట ప్రకారం నేను నా పని చేశాను. ఇది రాజకీయాలకు లేదా అధికారం కోసం కాదు.  జీవితంలో ఆత్మ సంతృప్తి కోసం కొన్ని పనులు చేయడానికి’ అని అన్నారు. ‘నేను గ్రామీణ నియోజకవర్గానికి చెందినవాడిని, అక్కడ ప్రజలు నాకు ప్రేమ, బలాన్ని ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను వందలాది దేవాలయాలను నిర్మించాను. మూడు ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా  ప్రభుత్వ విద్యా సంస్థలకు, వివిధ సంస్థలకు విరాళంగా ఇచ్చారు’  అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top