చింతమనేనికి పదవీ గండం?

Disqualification of tdp MLA Chintamaneni Prabhakar sought?  - Sakshi

రెండేళ్ల జైలు శిక్ష విధించిన భీమడోలు కోర్టు

విప్‌ పదవి వదులుకోవాల్సిందే

అనర్హత ఖాయమంటున్న విశ్లేషకులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దౌర్జన్యాలు, దాడులకు ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిన చింతమనేనికి భీమడోలు కోర్టు షాక్‌ ఇచ్చింది.2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడి చేయడంతో పాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్‌కుమార్‌ గన్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 5 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేయగా విచారణ చేసిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అధికారులు, ప్రతిపక్ష నాయకులు, పోలీసులు, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ వస్తున్న చింతమనేనిపై 42 కేసులు 1996 నుంచి నమోదు కాగా ఇప్పుడు శిక్ష పడటంతో రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది. కేసులో శిక్ష పడటం తో కచ్చితంగా తన విప్‌ పదవికి వెంటనే రాజీనామా చేయాల్సి ఉంది. మరోవైపు శాసనసభ్యుడిగా కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కేసును కొట్టివేస్తేనే చింతమనేనికి ఊరట లభిస్తుంది లేనిపక్షంలో శిక్ష ఖరారు అయితే శాసన సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో పాటు 2019లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది.

అధికారులు సహకరించకున్నా..
దెందులూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి 2011 నవంబర్‌ 26వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పటి మంత్రి వసంతకుమార్‌తోపాటు ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావులు హాజరయ్యారు. ఈ క్రమంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగానే స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మంత్రి వట్టి వసంత్‌కుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చింతమనేని ప్రభాకర్‌ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడుతూ వసంతకుమార్‌పై చెయ్యి చేసుకున్నారు. అడ్డుకున్న గన్‌మెన్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో గన్‌మెన్‌ ఎం.సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరో 14 మందిపై  దెందులూరు పోలీసులు క్రైమ్‌ నెంబర్‌ 218 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అప్పటి అధికారులు చింతమనేనికి భయపడి సాక్ష్యం చెప్పలేదు. ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తులేదంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ గత నెలలో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ఉండటంతో శిక్ష నుంచి తప్పుకునే అవకాశం చింతమనేనికి లేకుండా పోయింది. పూర్తి సాక్ష్యాధారాలు ఉండటంతో భీమడోలు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కె.దీపదైవకృప సంచలన తీర్పు చెప్పారు. ఈ తీర్పు జిల్లాలో సంచలనం సృష్టించింది. కోర్టుకు హాజరైన చింతమనేని తీర్పు అనంతరం డీలా పడ్డారు. ఆయనకు మద్దతుగా ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు,  దెందులూరు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చారు.

దౌర్జన్యాలు, దాడులకు కేరాఫ్‌
కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దౌర్జన్యం, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్‌ అధికారులకు బెదిరింపులు,  ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం, అంగన్‌వాడీ కార్యకర్తలను దుర్బాషలాడటం, పోలీస్‌ కానిస్టేబుల్‌ మధును చితక్కొట్టడం, అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే అంశంలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం, తాజాగా గత ఏడాది మే నెలలో గుండుగొలను జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్సై, సీపీఓలపై దాడి.. ఇలా ఎన్నో కేసులు నమోదయ్యాయి.

1996 నుంచి ఇప్పటి వరకూ కోర్టులో కేసులు కొట్టివేసినవి మినహాయిస్తే ప్రస్తుతం 42 కేసులు చింతమనేనిపై నమోదయ్యాయి. ఏలూరు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో రౌడీషీటు కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటివరకూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు బాధితులు భయపడటంతో శిక్షలు పడకుండా ఉన్నాయి. భీమడోలు కోర్టు తీర్పుతో చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలకు చెక్‌పడుతుందో లేదో చూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top