ముందస్తుపై సమాధానం చెప్పాల్సిందే

Dasoju Sravan Slams KCR On Early Polls - Sakshi

టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని గతంలో చెప్పిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్ధంతరంగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలపై జూలై 6న లా కమిషన్‌కు లేఖ రాసిన కేసీఆర్, సెప్టెంబర్‌ 6న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు దిగారని, అందుకు కారణాలను చెప్పకుండా దాటవేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని, టీఆర్‌ఎస్‌కు ఓట్లు దక్కవన్న భయంతో తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు పరుగులు పెడుతున్నారన్నారు.

జమిలి ఎన్నికలకు నాలుగు నుంచి ఆర్నెళ్లలోపు ఎన్నికల కోడ్‌ ఉండగా, ప్రస్తుతం ఈ పరిస్థితి ఏడాదికి పెరిగిందన్నారు. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి పురోగతి మందగిస్తుందన్నారు. తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దుచేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్కతాటిపైకి వచ్చి పరిస్థితిని ఎదుర్కోవాలన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయనే కుంటిసాకులతో ఆయన ముందస్తుకు పోతున్నానంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారని శ్రవణ్‌ విమర్శించారు. పదినెలల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశమున్నప్పటికీ వారి ఆశలను వమ్ముచేయడమేగాక, త్యాగం చేసినట్లు నటిస్తున్నారన్నారు. ఈ  సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, రవళి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top