
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రజా పోరుబాట ముగిసింది... ఇక ప్రభుత్వం మెడలు వంచేందుకు శంఖారావం మొదలైంది’అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడు పోరాడితే రాలేదు.. సబ్బండ వర్గాలు ఒక్కతాటిపైకి చేరి పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, నక్సల్స్ ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు’అని ఆయన ధ్వజమెత్తారు. ‘సామాజిక తెలంగాణ – సమగ్రాభివృద్ధి’కోసం సీపీఐ ఆ«ధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు రాజా, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీనేత ఇనుగాల పెద్దిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమల, యుసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ.గౌస్, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎస్‌బీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నాయన్నారు.
పచ్చి అబద్ధాల కోరు కేసీఆర్ అయితే, అంతకు మించిన అబద్ధాలకోరు ప్రధాని మోదీ అని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలను వంచించారని, 4 వేల మంది అమరులను కించపరిచారని అన్నారు. నిజాంను కీర్తిస్తూ దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలంటే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ సంపన్నులకు కొమ్ముకాస్తున్నారని, మూడున్నరేళ్లలో అమిత్‌షా కొడుకు కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని అన్నారు.
అంబానీ, అదానీలకే అచ్ఛేదిన్: రాజా
దేశానికి మంచి రోజులు వస్తాయని మోదీ ప్రభుత్వం చెబుతోందని, కానీ అంబానీ, ఆదానీలకే అచ్ఛేదిన్ వచ్చిందని రాజ్యసభ సభ్యుడు రాజా అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు చేసిన ప్రగతి ఏమీ లేదన్నారు. కంచ ఐలయ్య లాంటి రచయితలను అరెస్ట్ చేస్తుంటే ఎవరికి సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలపై తెలంగాణ ప్రభుత్వం దాడులను కొనసాగిస్తోందని, కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకోరని ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బడుగులు మారలేదు: ఉత్తమ్
తెలంగాణ వస్తే బడుగు, బలహీన వర్గాల బతుకులు మారుతా యని భావిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం వారిని అధఃపాతాళానికి తొక్కుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళితులను థర్డ్ డిగ్రీతో హింసిస్తూ, రైతులకు సంకెళ్లు వేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంట రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేదని, బ్యాంకుల్లో వడ్డీలు చెల్లించలేక, పంటలకు మద్దతు ధర రాక తెలంగాణ వచ్చాక 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అణగారిన వర్గాల కోసం సీపీఐ ఏ ఉద్యమం తీసుకువచ్చినా కాంగ్రెస్ పార్టీ కలసి పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మిమ్మల్ని మార్చక తప్పదు: తమ్మినేని
‘తెలంగాణ వచ్చి మూడున్నరేళ్లయినా ప్రజల బతుకులు మారలేదు. అందుకే మిమ్మల్ని మార్చక తప్పదు’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గద్దర్‌పై కాల్పులు జరిగి 20 ఏళ్లు గడుస్తున్నా నేటికీ విచారణ లేదని, అభివృద్ది జరగాలంటే పోరుబాట తప్పదని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో మాదాల రవి, అజీజ్‌పాషా, కాంగ్రెస్ నేతలు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మృత్యుంజయంతోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు.