ఒకరికి జైలు, మరొకరికి పదవా!?

Congress Must Rethink Choice Of  Leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోమవారం నాడు దేశంలో రెండు విభిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నాయకుడు సజ్జన్‌ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడగా, అదే కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌ నాథ్‌కు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి లభించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను విచారించిన నానావతి కమిషన్‌ అందులో కమల్‌ నాథ్‌ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అంతేగానీ అతను నిర్దోషి అని తేల్చలేదు. సజ్జన్‌ కుమార్‌ హస్తముందన్న విషయాన్ని నానావతి కమిషన్‌ అనుమానించడంతో సీబీఐ దర్యాప్తు జరిపి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది.

ఈ కేసులో సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ జర్నలిస్ట్‌ సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఢిల్లీలోని గురుద్వార్‌పై దాడి చేసిన అల్లరి మూకను రెచ్చగొడుతూ కమల్‌నాథ్‌ ప్రసంగించారు. అదే పని చేసిన సజ్జన్‌ కుమార్‌కు శిక్ష పడింది. అదే పని చేసినట్లు సాక్షులు చెబుతున్నట్లు కమల్‌ నాథ్‌ శిక్ష నుంచి తప్పించుకోవడంతోపాటు సీఎం పదవి అనే రివార్డు కూడా లభించింది. ఈ దేశంలో నేరం చేసి తప్పించుకునే అవకాశాలు రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉన్నాయి. 1984 నాటి అల్లర్ల బాధితులు అవిశ్రాంతంగా పోరాడడం వల్ల 2000 సంవత్సరంలో కేంద్రం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సజ్జన్‌ కుమార్‌ కేసును సీబీఐ దర్యాప్తు జరపడం, కేంద్రంలో గత నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రెండు కేసులను తప్పించుకున్నా మూడో కేసులో సజ్జన్‌ కుమార్‌కు శిక్ష పడింది. నేరం చేసిన రాజకీయ నాయకులను ఓ రాజకీయ వ్యవస్థ వెనకేసుకు రావడం వల్ల ఒకరు తప్పించుకోగలిగారు. ప్రత్యర్థికి శిక్ష పడాలని అదే రాజకీయ వ్యవస్థ కోరుకోవడం వల్ల మరొకరికి శిక్ష పడింది.

ఇందులో బీజేపీ ప్రభుత్వం నిజం పక్కన నిలబడిందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సజ్జన్‌ కుమార్‌కు శిక్ష విధించిన హైకోర్టే, ఇంతకుముందు దేశంలో, అంటే 1993లో ముంబైలో, 2002లో గుజరాత్, 2008లో కంధమాల్, 2013లో ముజాఫర్‌ నగర్‌లో జరిగిన అల్లర్లను ప్రస్థావించింది. ఈ అన్ని అల్లర్లు ఓ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లే కాకుండా అన్నింటిలోనూ బీజేపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి, కొన్నింట్లో కేసులు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ ‘హస్తం’ ముందుగా శుభ్రంగా ఉండాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top