రేవంత్‌ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

Congress MP Revanth Reddy Face 63 Cases - Sakshi

రేవంత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 63 కేసులు నమోదు

త్వరితగతిని విచారణ చేయాలంటున్న న్యాయవాదులు

ఏ ఒక్క కేసులో శిక్ష పడినా పదవికి గండమే

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్‌ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. విడుదలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసింది. ఇదిలావుండగానే పీటీ వారెంట్‌పై విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు డ్రోన్‌ కెమెరా కేసులో రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీనితో స్థానిక వ్యవహారం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్‌ దూకుడుగా వ్యవహరిస్తూ.. సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న పెండింగ్‌ కేసులో త్వరగతిన విచారణ జరిపించాలని ఆయన ప్రత్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. (భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!)

రేవంత్‌పై నమోదైన కేసుల చిట్టా..
ఆర్వోసీ, సీబీఐతో పాటు ఎన్నికల కమిషన్‌ వద్ద పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికితోడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఓటుకు నోటు కేసుతో సహా, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటి కేసులు ప్రస్తుతం విచారణలో విచారణ ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. 32కేసులు ఇప్పటికే ఆయనపై నమోదై ఉన్నాయి. జూబ్లిహిల్స్ హౌజింగ్‌ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్‌ కేసులు, ట్రెస్‌పాస్‌, వివిధ  ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్‌పై ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్‌లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్‌3, బంజారాహిల్స్‌ 3, అబిడ్స్ 3, సుల్తాన్‌ బజార్‌ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు రేవంత్‌పై నమోదై విచారణ దశలో ఉన్నాయి. (రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత)

దీంతో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ జరపాలని న్యాయవాది రామారావు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వీటిల్లో ఏ కేసులో అయినా నేరం రుజువై.. శిక్ష పడితే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఓటుకు నోటు కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలై.. బలమైన సాక్షాధారాలు ఉన్నందున ఈ కేసు నుంచి రేవంత్‌ తప్పించుకోవడం అంత సులభంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన గోపనపల్లి భూకబ్జా కేసులో అనేక అక్రమాలతో పాటు వాటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడం తెలిసిందే. మరోవైపు రేవంత్‌రెడ్డి అరెస్టుపై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ సభ్యుడు మాణికం ఠాగోర్‌ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top