‘కర్ణాటక కాంగ్రెస్‌’ రద్దు

Congress dissolved KPCC committee - Sakshi

ఏఐసీసీ అనూహ్య నిర్ణయం

ప్రెసిడెంట్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యధాతథం

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, సంకీర్ణ ప్రభుత్వంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ)ని ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌  ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్‌ దినేశ్‌ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్‌ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు.  

నిజాయితీతో పని చేసేవారికే...
పార్టీలో నూతన కార్యవర్గానికి అవకాశం కల్పిస్తామని, నిజాయితీగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉండే వారికే అవకాశం ఇస్తామని దినేశ్‌ స్పష్టం చేశారు. 280 మందిని తొలగించి అదే స్థాయిలో నాయకులను నియమించే అవకాశం ఉంది.

నిజం చెబితే తొలగిస్తారా ?  
లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయానికి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ దినేశ్‌ వంటి కొందరు నేతలే కారణమంటూ కాంగ్రెస్‌ మైనార్టీ నేత రోషన్‌ బేగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్‌ నుంచి తొలగించింది. నిజాలు మాట్లాడితే తొలగిస్తారా ? నాపై చర్యలు తీసుకున్నారు సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లపై చర్యలు లేవా అంటూ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top