కిషోర్‌కు బ్రేకులు | Conflicts In Nallari Family Chittoor | Sakshi
Sakshi News home page

కిషోర్‌కు బ్రేకులు

Nov 13 2018 11:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

Conflicts In Nallari Family Chittoor - Sakshi

కాంగ్రెస్‌తో టీడీపీ తాజా చెలిమి పీలేరు రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ కుటుంబీకుల మధ్య చిచ్చు రాజేస్తోంది. కిరణ్‌ సోదరుల మధ్య అంతరం పెంచుతోంది. జిల్లాలో నామమాత్ర ప్రభావమున్న కాంగ్రెస్‌ రానున్న ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గాన్ని కోరుతున్నట్లు అందుతున్న సమాచారం మాజీ సీఎం సోదరుడు కిషోర్‌ వర్గానికి కునుకు పట్టనీయడం లేదని తెలుస్తోంది.  గతంలో తాను  ప్రాతినిథ్యం వహించిన పీలేరులో తన కుమారుడిని పోటీ చేయించాలని కిరణ్‌కుమార్‌ భావిస్తున్నారు. తాజాగా టీడీపీలో చేరి ఇక్కడి నుంచి పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్న కిషోర్‌కుమార్‌ ఆశలపై ఈ పరిణామం నీల్లు చల్లుతోంది.

సాక్షి,చిత్తూరు, తిరుపతి: తెలంగాణలో కాంగ్రెస్‌తో చెట్టపట్టా లేసుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో అదేతీరు కొనసాగిస్తుందనే ఊహాగానాలు బలం పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు వాస్తవానికి జిల్లాలో పట్టులేదు. మాజీ సీఎం నల్లారి కిరణ్‌ గతంలో ప్రాతినిథ్యం వహించిన పీలేరులో అంతో ఇంతో ఈ పార్టీకి ఉనికి ఉందని ఆయన సన్నిహితుల అంచనా. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటును ఒప్పందం కుదిరితే అడగాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలు స్తోంది. టీడీపీ కూడా ఇందుకు అంగీకరిస్తుందనే సంకేతాలందినట్లు హస్తం పార్టీ నాయకులు చెబు తున్నారు. ఈ ఆకస్మిక రాజకీయ మార్పు కిరణ్‌ సోదరుడు కిషోర్‌కు మింగుడుపడటంలేదు. సోదరుడి మాట పెడచెవినబెట్టి టీడీపీలోకి వచ్చారని చెబు తున్న ఈయనకు తీవ్రమైన భంగపాటు ఎదురవుతోంది. వచ్చే ఎన్నికల్లో పీలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిరణ్‌ తనయుడు నల్లారి నిఖిలేష్‌రెడ్డి పేరు ఖరారు చేయనున్నారని జరుగుతున్న ప్రచారం అనూహ్యమైన షాక్‌. ఇప్పటివరకూ తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటిస్తున్న కిషోర్‌కు ఎదురుదెబ్బ తగులుతోందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కిరణ్‌ 2014 ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.  తమ్ముడు కిషోర్‌ వైఖరి ఇందుకు కారణమని మాజీ సీఎం వర్గీయుల భావన. టీడీపీలో చేరిన కిషోర్‌ తరువాత అన్నను దూరంగా పెడుతూ వచ్చారు. అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించి... అధికారం పోయాక ఆయన్ను పట్టించుకోలేదు.  ఇటీవల  సొంతూరు నగరిపల్లి వచ్చినా వీరిద్దరూ కలుసుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఎదురుపడ్డా అన్నను పలుకరించకుండా వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలిసి పొత్తు ఖరారు చేసుకున్నారు.

పొత్తు పొసగేనా..
ఇటీవల కిరణ్‌ మళ్లీ సొంత గూడు కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పార్టీతో టీడీపీకి సఖ్యత కుదిరింది. పొరుగున ఉన్న తెలంగాణాలో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా రాహుల్‌తో చంద్రబాబు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు కాంగ్రెస్‌కు చేరాయి. ఈ నేపథ్యంలోనే పీలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన   సతీమణి ఒత్తిడి మేరకు కిరణ్‌ కుమార్‌రెడ్డి కుమారుడు నిఖిలేష్‌ను బరిలో దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలి సింది. సీఎంగా పనిచేసిన వ్యక్తి పీలేరు అసెంబ్లీ స్థానం అడగటంతో అధిష్టానం కూడా కిరణ్‌ ప్రతిపాదనను ఓకే చేసినట్లు సమాచారం. చంద్రబాబు నిర్ణయం పీలేరులో టీడీపీలో కలవరం రేపుతోంది. 2014 ఎన్నికల్లో పీలేరు నుంచి త్రిముఖ పోటీ జరిగింది. జై సమైక్యాంధ్ర పక్షాన కిషోర్‌ ఓడిపోయారు. టీడీపీ తరఫున ఇంతియాజ్‌ అహ్మద్‌ ఓటమి పాలయ్యారు. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఓడిపోయినా పార్టీ భరోసా ఇస్తుందని ఆశించిన ఇంతియాజ్‌కు నిరాశ మిగిలింది. కిషోర్‌ను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దించడంతో ఈయన ఖంగుతిన్నారు. టికెట్‌ తనకే వస్తుందని కిషోర్‌ వర్గం చెబుతుండటంతో ఇప్పటికే వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. తాజాగా ఈ సీటు కాంగ్రెస్‌కు కేటాయిస్తారని తెలియడంతో కిషోర్‌ డీలా పడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement