
పశ్చిమ గోదావరి : పోలవరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏలూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదాల విషయంలో పార్లమెంట్ లోపల, బయటా కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావడంలో సీఎం చంద్ర బాబు నాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకి చేసిందేమీ లేదని, చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలను వైఎస్ జగన్ స్వయంగా తెలుసుకుంటున్నారని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటమే వైఎస్సార్ సిపి ధ్యేయమన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీని వైఎస్సార్సీపీ ఎంపీలు కలవబోతున్నారని తెలిపారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారైందని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 నాటికి కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరబోతున్నామని వెల్లడించారు.