ప్రొటోకాల్‌కే ‘పెద్దలు’ అయ్యో పాపం ఎమ్మెల్సీ!

Cold war betweet TRS MLAs and MLCs - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కోల్డ్‌వార్‌  

తమ మాట ఎవరూ వినడం లేదని ఎమ్మెల్సీల గోడు 

 ‘పేరుకు పెద్దల సభ. కానీ మండల స్థాయిలో చిన్న అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే కంటే ప్రొటోకాల్‌ పెద్దదే. అయినా ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎక్కడా అడుగుపెట్టలేని పరిస్థితి. సీడీపీ నిధుల నుంచి చిన్న సిమెంట్‌ రోడ్డు వేద్దామన్నా ఎమ్మెల్యే పర్మిషన్‌ ఉండాల్సిందే. ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని నిస్సహాయత. పేరుకు పెద్ద పదవి ఉన్నా ఎవరినీ ఆదుకునే అవకాశం లేదు’ 
– రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆవేదన 

‘‘నియోజకవర్గంలోని ఓటర్లతో నేరుగా ఎన్నికయ్యాను. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పెత్తనం చేస్తానంటే ఎలా? ఏ గ్రామంలో ఎవరేం పని చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో నాకు తెలుసు. ఒక ఎమ్మెల్సీ వచ్చి నన్ను లెక్కపెట్టకుండా రోడ్డు పనో, మరో పనో ఇచ్చుకుంటూ పోతే నా మాటకు ఎవరు విలువ ఇస్తరు? నాకు తెలియకుండానే నియోజకవర్గంలో పనులు అవుతున్నాయంటే నేనెందుకు?’’ 
– ఇదీ అధికార పార్టీ ఎమ్మెల్యేల వాదన 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న అధికార యుద్ధం ఇదీ! వీరేకాదు.. ఎమ్మెల్యేలతో ఎంపీలు, జెడ్పీలకు కూడా పొసగడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, పార్టీ అంతర్గత వ్యవహారాలు.. ఇలా ఏ అంశమైనా ఇదే పరిస్థితి ఉంటోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఇది తలనొప్పిగా మారుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య పోరులో గులాబీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు నలిగిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఏకంగా నేతల మధ్య పరస్పరం పోలీసు కేసులు, దాడులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి విషయంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేసే యంత్రాంగం పార్టీలో లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

పచ్చగడ్డి వేస్తే భగ్గు 
గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన పలువురు నేతలకు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేకపోయామని, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి చూద్దామంటూ పార్టీ భరోసా ఇవ్వడంతో పలువురు ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్నారు. ఇలాంటివారి విషయంలో యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సర్కారు కూడా ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తోంది. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్‌ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ఆదేశాలిచ్చారు. గతంలో పలుమార్లు జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాలతోపాటు బహిరంగంగా కూడా సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలు, అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని నిర్దేశించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా ఏ నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు.

ఈ ఆదేశాలతో తమ పరిస్థితి మరింత దీనంగా తయారైందని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎమ్మెల్సీలను ఎందుకు పట్టించుకోవాలనే ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ‘‘పటేల్, పట్వారీలు నా పట్టు. నన్ను ఎట్లా కొడతవో కొట్టురా మొగుడా’’అన్నట్టుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని శాసన మండలిలో సీనియర్‌ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పోలీస్‌ స్టేషన్‌లో, రెవెన్యూ కార్యాలయాల్లోనూ చిన్న పనులు చెప్పినా కావడం లేదని పలువురు మండలి సభ్యులు వాపోతున్నారు. మండల స్థాయిలోని చిన్న అధికారులు కూడా తమ మాటలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ‘‘నెల జీతం, సౌకర్యాలు, గన్‌మన్‌ వంటివి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. నన్ను నమ్ముకున్నవారికో, ప్రజలకో ఏదైనా చేస్తాననే విశ్వాసం కూడా లేకుండా పోయింది. పేరుకు పదవి ఉన్నా ఎలాంటి సంతృప్తి లేదు’’అని ఓ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎన్నో ఆటుపోట్లు అధిగమించాల్సి వస్తుందని ఎమ్మెల్యే అంటున్నారు. గ్రామ స్థాయిలో నుంచి ఎవరేమిటో, వారికేం చేయాలో, ఎవరిని ఎక్కడ అదుపులో పెట్టుకోవాలో ప్రత్యక్షంగా తమకున్న అనుభవం, ఇబ్బంది ఎమ్మెల్సీకి ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యలున్న నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలను, ఇటు ఎమ్మెల్సీలను సమన్వయం చేయడంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. 

ఎక్కడెక్కడ.. ఎవరెవరు? 
- నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ టికెట్‌ను ఆశించిన భూపతిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్యే అవకాశాన్ని గోవర్ధన్‌కు ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశిస్తున్న వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గోవర్ధన్‌ కోరిక మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా సమావేశమై ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానించారు. 
నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మధ్య పొసగడం లేదు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్‌ ఆశించిన కర్నెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య సమన్వయంలో సమస్యలు వస్తున్నాయి. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య కూడా ఇలాంటి విభేదాలే ఉన్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టి.రాజయ్య ఉండగా.. గతంలో ఇదే స్థానం నుంచి కడియం ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళి స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాననే అసంతృప్తితో ఉన్నారు. పరకాల నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో లోలోన మధనపడుతున్నారు. అసంతృప్తిని బయటకు ప్రకటించకపోయినా ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డికి మధ్య సమస్యలు వస్తున్నాయి. భూపాల్‌రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. 

ఎంపీలు, జెడ్పీలదీ ఇదే పరిస్థితి.. 
ఎంపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా నియోజకవర్గంలో రూపాయి ఖర్చు పెట్టలేని దుస్థితిలో అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎంపీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకే కేటాయించాలని పార్టీ అధినేత నుంచి సూచనలున్నాయి. ఎమ్మెల్యేకు నచ్చకుంటే చిన్న పని కూడా చేయలేకపోతున్నామని ఎంపీలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకు తామే బాస్‌ అయినా ఎమ్మెల్యేను కాదని అడుగు పెట్టే పరిస్థితి లేదని అటు పలువురు జెడ్పీ చైర్మన్లు కూడా ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ బాలు నాయక్‌కు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌ మధ్య ఇదే పరిస్థితి ఉంది. కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో పొసగడం లేదు. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్, ములుగు ఎమ్మెల్యే, మంత్రి చందూలాల్‌ పరస్పరం బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top