మీ అయ్య జాగీరా?

CM KCR Fires on PM Narendra Modi in TRS Public Meetings - Sakshi

అసెంబ్లీ తీర్మానం చేసినా రిజర్వేషన్లు పెంచరా?

మోదీపై కేసీఆర్‌ ధ్వజం

సాక్షి నెట్‌వర్క్‌: ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఇక్కడ ముస్లింలు, గిరిజనుల జనాభా పెరిగింది. వారి జనాభా ఆధారంగా విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు పెరగాల్సిన అవసరం ఉంది. వారి రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా.. ప్రధాని మోదీ ఇవ్వనంటున్నారు. భారతదేశం మీ అయ్య జాగీరా.. మేం ఇవ్వం అని అంత అహంకారంగా ఎలా మాట్లాడతారు’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు 50శాతానికి మించ కూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రజల మనోభావాల మేర నిర్ణయాలు తీసుకోని పక్షంలో దేశంలో ఆందోళనలు చెలరేగుతాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్, మెదక్‌ జిల్లా నర్సాపూర్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గంలోని పెద్దకొడప్‌గల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘ప్రధాని మోదీ నిజామాబాద్‌లో మాట్లాడినవి ఝూటా మాటలు. దేశ ప్రధాని హోదాలో అలా మాట్లాడాల్సింది కాదు.

ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. తెలంగాణలో ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. ప్రజల దగ్గర మోదీ అయినా కేసీఆర్‌ అయినా ఒక్కటే. అబద్దాలు మాట్లాడితే చెల్లదు. మేం గొర్రెలం అనుకున్నావా? అడ్డం పొడవు మాట్లాడుతున్నవ్‌.. తెలంగాణలో కరెంటు బాగాలేదని, మిషన్‌ భగీరథ నీళ్లు రావడంలేదని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. నిజామాబాద్‌ల అయినా, బాన్సువాడలో అయినా కరెంటు పోతుందా? ఇంత మంచి కరెంటు ఇస్తుంటే ప్రధాని అబద్ధాలు చెప్పారు. ఒకవేళ కాంగ్రె సోళ్లు అధికారంలోకి వస్తే కరెంటు పోతుంది తప్ప టీఆర్‌ఎస్‌ పాలనలో కరెంటు పోయే ముచ్చట లేదు’అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

ఆయుష్మాన్‌ భారత్‌.. పెద్ద బోగస్‌..
మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పెద్ద బోగస్‌ అని కేసీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో 20 శాతం మందికి కూడా ఈ పథకం వర్తించదని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే మంచి పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు వివరించారు. సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మోదీ ఏజెంటు, బీజేపీ రాష్ట్ర «అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చిత్తశుద్ధి ఉంటే మీ ఆయుష్మాన్‌ స్కీం బాగుందో..? మా స్కీమ్‌లు బాగున్నాయో? సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. ‘బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రూ.వెయ్యి పింఛన్‌ ఇస్తున్నారా? కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారా? రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారా? మీరు మాట్లాడింది వింటానికి మేం పిచ్చోళ్లమా? తెలంగాణ అగ్గువ దొరికిందా? మోదీ, అమిత్‌షా, సోనియా, రాహుల్‌ గాంధీ, సీపీఐ, సీపీఎం.. వీళ్లకు చివరకు చంద్రబాబు నాయుడు తోడయిండు’అని కేసీఆర్‌ దుయ్యబట్టారు. నాలుగు పార్టీలు కాదు.. నలభై పార్టీలు ఏకమైనా తమను ఏమీ చేయలేరని ఉద్ఘాటించారు. దేశం మీద బీజేపీ, కాంగ్రెస్‌ పెత్తనం ఎక్కువైందని, అధికారం గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిలో 2 పార్టీలు దుర్మార్గ పాలన చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీతో సంబంధం లేని ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాల హక్కుల నెరవేరుతాయని అన్నారు.  

కాంగ్రెస్‌ గెలిస్తే పథకాలు రద్దే: హరీశ్‌
కాంగ్రెస్‌ గెలిస్తే పథకాలన్నీ రద్దవుతాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. నారాయణఖేడ్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. తండాలు, పల్లెల్లో భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నాడు కరెంట్‌ ఉంటే వార్త, నేడు కరెంటు లేకుంటే వార్తగా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ శనిని తెచ్చుకుంది...
‘తెలంగాణను అడ్డుకుని, రాష్ట్ర ప్రాజెక్టుల మీద కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబును కాంగ్రెస్‌ నెత్తిన పెట్టుకుని తెస్తోంది. మన ఇజ్జత్‌ కా సవాల్‌.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద చంద్రబాబు పెత్తనం అవసరమా? చంద్రబాబును నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్‌ శనిని తెచ్చుకుని నష్టపోయింది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్‌ను తానే కట్టిన అంటడని, చార్మినార్‌ను గూడ కట్టిండేమోనని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో పాలన సాఫీగా సాగుతోంది. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడడమే బంగారు తెలంగాణ లక్ష్యం’అని స్పష్టంచేశారు. ఎన్నికలు అంటే కుల, మత గజ్జితోపాటు డబ్బు, మద్యం సరఫరా జరుగుతుందని, అలాంటి పిచ్చి వేషాలు పోవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి అయోమయం లేదని.. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు ఉంటే మరోవైపు టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల క్షేమం కోరే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు.

కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రచారం వాయిదా
సాక్షి, హైదరాబాద్‌: సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం వాయిదా పడింది. బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రచారం చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో దీన్ని వాయిదా వేశారు. సీఎం వచ్చే వారం అక్కడ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్‌లోనూ భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. పరేడ్‌గ్రౌండ్స్‌లో డిసెంబర్‌ 3న ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు సైతం మొదలుపెట్టింది. అయితే రక్షణ శాఖ కార్యక్రమాలు, ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్‌ పర్యటన అదేరోజు ఉండటంతో టీఆర్‌ఎస్‌ సభ నిర్వహణకు అనుమతులు రాలేదు. దీంతో మరోరోజు ఈ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాకుండా గజ్వేల్‌లోనే ఈ సభ నిర్వహించే అంశాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌ 2 లేదా 4న ఈ సభ జరగనున్నట్లు సమాచారం.  


బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు


బాన్సువాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌. చిత్రంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top