సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో హడావిడిగా ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడ చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు. పార్లమెంటు ఆవవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్లు వద్ద ఫొటోగ్రాఫర్ల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు పోజులిచ్చారు. పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద యోగా తరహాలో ముందుకు వంగి.. మెట్లను చేతులతో తాకిన చంద్రబాబు.. అది కెమెరాలో రాలేదని కెమెరామేన్ చెప్పడంతో.. మరోసారి పార్లమెంటు మెట్లను తాకుతూ కెమెరాల వైపు చూసి ఫోజు ఇచ్చారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన నమస్కారం చేసి సందర్భంలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. అచ్చం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరహాలో చంద్రబాబు పార్లమెంటు వద్ద ఫొటోషూట్‌లు చేస్తున్నారని, ఫొటోల మీద యావ తప్ప ఆయన చర్యల్లో నిజాయితీ కనిపించడం లేదని ఈ తంతును చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఎద్దేవా చేసిన చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం ప్రజావెల్లువను చూసి.. ఇప్పుడు ఆ క్రెడిట్ తనకే దక్కాలన్న ఆత్రుతతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన డ్రామాకు తెరతీశారు.
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషితో అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు, తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కావలసిన సభ్యుల సంఖ్య అన్నీ సమకూరాయి. దాంతో ఆ క్రెడిట్ తనకు దక్కాలనే.. తామే అవిశ్వాసం ప్రవేశపెడతామని చంద్రబాబు పోటీ నోటీసులిస్తున్నారు. పోనీ చంద్రబాబు వచ్చి చిత్తశుద్ధితో పోరాడతారా.. తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించబోతున్నారా అంటే అలాంటిదేమీ లేదు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడితే ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేద్దామని, ఆమరణ దీక్ష చేద్దామని, అపుడే కేంద్రం దిగివస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రతిపాదిస్తే దానికీ చంద్రబాబు సిద్ధం కావడం లేదు. వీటిలో వేటినీ చంద్రబాబు అంగీకరించడం లేదు. తన అవినీతి గురించి తనకు బాగా తెలుసు కనుక.. కేంద్రం ఒకవేళ విచారణకు ఆదేశిస్తే మద్దతుగా నిలబడే పార్టీలను కూడగట్టి తనను తాను రక్షించుకునేందుకే ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు తప్ప రాష్ట్రప్రయోజనాల కోసం కాదని విశ్లేషకులంటున్నారు.


