వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్నపాత్రుడి సోదరుడు 

Chintakayala Sanyasi Patrudu into YSRCP - Sakshi

సాదరంగా ఆహ్వానించిన సీఎం వైఎస్‌ జగన్‌

సీఎం సంక్షేమ పథకాలు అపూర్వం: సన్యాసిపాత్రుడు  

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సన్యాసిపాత్రుడుతోపాటు ఆయన సతీమణి, నర్సీపట్నం మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత, మరికొందరు మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. సన్యాసిపాత్రుడు తన అనుచరులతో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైఎస్‌ జగన్‌ను కలవగా.. ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం సన్యాసిపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదు నెలల్లో ప్రజలకోసం అపూర్వమైన రీతిలో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, వాటి పట్ల ఆకర్షితులమై తమ కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరామని చెప్పారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ట ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో సన్యాసిపాత్రుడి కుమారుడు వరుణ్, మాజీ కౌన్సిలర్లు ఎం.అప్పారావు, ఎం.శ్రీనివాసరావు, ఎం.గణేష్, సీహెచ్‌.సతీష్, మీసాల సత్యనారాయణ, సీహెచ్‌ కరుణాకర్, ఆర్వీ రమణ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. 

పవన్‌.. చంద్రబాబుకు దత్తపుత్రుడే: విజయ సాయిరెడ్డి 
ఇసుకపై ఆందోళన పేరుతో హడావుడి చేస్తున్న పవన్‌ ముమ్మాటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడేనని, అందులో ఎలాంటి సందేహం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ.. పవన్‌ చేసింది లాంగ్‌మార్చ్‌ కానే కాదని, అది రాంగ్‌ మార్చ్‌ అని పునరుద్ఘాటించారు. పవన్‌.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడుస్తున్నారన్నారు. పవన్‌ ఢిల్లీ వెళ్లి నేతలతో మాట్లాడినా, అమెరికా వెళ్లి అధ్యక్షుడితో మాట్లాడినా ప్రయోజనమేమీ ఉండబోదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top