
సిద్దిపేటకమాన్: నాలుగేళ్ల కాలంలో విభజన హామీలు ఒక్కటీ అమలు కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మంజూరు కాలేదని, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, హైకోర్టు విభజన జరలేదని పేర్కొన్నారు.
రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే, టీఆర్‌ఎస్ మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతం అని నిలదీశారు. ఇక్కడ ఎంఐఎంతో దోస్తీ చేస్తూ అక్కడ బీజేపీతో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాలను తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. కాగా, ‘సమస్యలపై సమరం’పేరుతో తమ పార్టీ తరఫున ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేయనున్నామని పేర్కొన్నారు.