
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. రథయాత్ర చేపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ సీఎం యడ్యూరప్ప వాహనంపై బీజేపీ అసమ్మతి కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చౌదరి నాగేశ్ మద్దతుదారులు యడ్యూరప్ప వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడి నుంచి యడ్యూరప్ప తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రథయాత్రను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.