తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి

bjp special focus on telangana - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ 20 శాతం ఓట్లు సాధించి నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్రంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువా రం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడంపై అమిత్‌ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన పదాధి కారుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవడంతో వాటి పరిధుల్లోని 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో పుంజుకున్న పార్టీని దక్షిణ తెలంగాణకు విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని, దానికి ముందుగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి నేతల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అన్నారు. దేశవ్యాప్తంగా గల్లంతైన కాంగ్రెస్‌.. రాష్ట్రంలో కూడా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగే స్థితి లేకుండా స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం టీఆర్‌ఎస్‌ జెండా మోస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా భావించి లోక్‌సభ ఎన్నికల్లో పట్టంకట్టారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top