‘ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే నయం’

BJP MLA Surendra Singh Says Prostitutes Better Than Government Officials - Sakshi

పాట్నా : బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ ఇటీవల తరుచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలోకి ఎక్కడం పరిపాటిగా మారింది. తాజాగా మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులకంటే ప్రాస్టిట్యూట్లు(వేశ్యలే) నయమని సురేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తూ.. మనల్ని సంతోష పరుస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాక లంచాలు అడిగిన ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు కూడా. బైరియా తహసీల్దార్‌ ఆఫీసులో అధికారులు లంచాలు అడిగారనే ఆరోపణలపై మండిపడ్డ సింగ్‌, ఈ మేర ఆదేశాలు జారీచేశారు. 

సింగ్‌ తన మద్దతుదారులతో కలిసి ‘వార్నింగ్‌ డే’ ను నిర్వహించారు. లంచాలు అడిగిన అధికారుల వాయిస్‌లను కూడా రికార్డు చేయాలని మద్దతుదారులను కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న  ఎమ్మెల్యే  సురేంద్ర సింగ్‌, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, వారి సంక్షేమం కోసం తాను జైలుకి వెళ్లడానికైనా సిద్దమన్నారు. సురేంద్ర సింగ్‌ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర కామెంట్లు చేశారు. కొంతమంది మంత్రులను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తీసేయాలని, లేదంటూ యూపీలో పతనం తప్పదని హెచ్చరించారు. పోలీసు స్టేషన్లలో, తహసీల్దార్‌ ఆఫీసుల్లో, బ్లాక్‌ ఆఫీసుల్లో పేద ప్రజల బాధలను వినకపోతే, వారు బీజేపీకి ఓటు వేయరన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top