గోరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు

BJP MLA Raja Singh submits Resignation Letter - Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: గోరక్షణ కోసం చంపడానికైనా, చావడానికైనా తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. బక్రీద్‌ సందర్భంగా పాతబస్తీలోకి మూడు వేలకుపైగా ఆవులు, ఎద్దులు, దూడలను తీసుకువచ్చారని, వాటిని కాపాడే క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించారు. 4 రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాజీనామా లేఖ అందించానన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే అన్ని రహదారుల్లో బక్రీద్‌కు నెలరోజుల ముందే గత ప్రభుత్వాలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేవని, జంతువులను తరలించేవారిపై కఠినంగా వ్యవహరించేవని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో యాగాలు, వ్రతాలు చేస్తారే కానీ, గోవులను, ఎద్దులను కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలేదని అన్నారు, ఆవు, ఎద్దు విశిష్టత గురించి ఆయన నమ్మే సిద్ధాంతిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గోరక్షణ కోసం గొడవలు, హత్యలు జరిగాయని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.

ప్రభుత్వ స్టీరింగ్‌ ఎంఐఎం చేతుల్లో ఉందని, అది ఎటు తిప్పితే ప్రభుత్వం అటు తిరుగుతోందని ఆరోపించారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఎద్దులు కూడా పనికిరానివంటూ మున్సిపల్‌ పశు వైద్యులు లంచం తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంలోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వేలాదిగా ఉన్న గోరక్షదళ్‌ కార్యకర్తలతో తామే గోవులను కాపాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్‌ అధ్యక్షుడు మహేశ్‌ అగర్వాల్, అజయ్‌రాజ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top