బీజేపీ అధికార ప్రతినిధి సత్యమూర్తి
సాక్షి, విజయవాడ: ధర్మదీక్ష పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి సత్యమూర్తి తీవ్రంగా ఖండించారు. అసలు తెలుగే సరిగా రాని బాలకృష్ణ హిందీలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల గురించి హేళనగా మాట్లాడిన బాలకృష్ణకు, మోదీ గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. మోదీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణపై కేసులు పెడతామని తెలిపారు.
ప్రధాని మోదీపై విమర్శలు చేసిన బాలయ్య తన నోరును పినాయిల్‌తో కడుక్కోవాలని సూచించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని.. గతంలో తన నివాసంలోనే ఆయన కాల్పులు జరిపారని ఈ సందర్భంగా సత్యమూర్తి గుర్తుచేశారు. బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ఓ మెంటల్ హాస్పిటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు సూచించారు. బీసీ నేత అయిన మోదీ ప్రధానిగా ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
స్క్రిప్ట్ ఉంటేనే హీరో.. లేకపోతే బాలయ్య జీరోనే
సాక్షి, హైదరాబాద్: స్క్రిప్ట్ ఉంటేనే బాలయ్య హీరో అని.. లేకపోతే జీరోనేనని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు విల్సన్, రమేష్ నాయుడు, కోటేశ్వరరావులు హైదరాబాద్‌లో ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నోరు తెరిస్తే బూతు పురాణాలే మాట్లాడతారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకుగానూ బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుది ధర్మదీక్ష కాదని.. అధర్మ దీక్ష అని విమర్శించారు. చంద్రబాబుది అవినీతి, అసమర్ద పాలన అని మండిపడ్డ నేతలు.. దీక్ష పేరుతో 20 కోట్ల రూపాయాల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.


