‘ఆయన్ని కూడా బాబు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’

BJP Leader Vishnuvardhan Reddy Slams Chandrababu Over Vivekananda Reddy Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీకి రాకుండా జీవోలు ఇస్తారు.. గతంలో పరిటాల రవి చనిపోతే సీబీఐ ఎంక్వయిరీ కావాలన్నారు.. కానీ ఈ మధ్య జరిగే ఘటనలకు మాత్రం సీబీఐ దర్యాప్తు వద్దంటున్నార’ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దురదృష్టవశాత్తు హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ఎక్కడ కూడా, ఏ రాజకీయ పార్టీ హత్యా రాజకీయాలు చేయలేదన్నారు. నిన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా అదే హత్యారాజకీయానికి బలయ్యారని తెలిపారు. రాయలసీమను స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని అనుకోవడం లేదన్నారు. ఏదో విధంగా ఈ ఎన్నికలు వాయిదా పడాలని చూస్తున్నారని, ఇదంతా కుట్రగా.. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ మధ్య వార్‌గా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న రాత్రి మీడియా సమావేశంలో తానే డీజీపీ లాగా, పోలీసులాగా మాట్లాడటం ఏంటి..? వారు మాట్లాడే అంశాలు తానే చెప్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికలు వాయిదా వేయాలనే అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అదనపు బలగాలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ఏం చేసినా సిట్ వేస్తారు.. ఓటుకు నోటు కేసులో సిట్.., లోకేష్ తెలంగాణలో డేటా దొంగిలిస్తే సిట్.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాస్త బాబు ఆఫీస్‌లో సిట్ అంటే కూర్చోవడమే అంటూ ఎద్దేవా చేశారు. నిజాయితీగా పని చేసే పోలీసులు పని చేయలేకపోతున్నారన్నారు. ఏపీలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు వద్దంటే సింగిల్ జడ్జ్ విచారణ అయినా చేపించాలని కోరారు. బాబుకు, టీడీపీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. పోలీసులు కేసును సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌ను కూడా బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top