అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం..

BJP Disrespects National Anthem In Karnataka Assembly Says Rahul Gandhi - Sakshi

రాయ్‌పూర్‌: బలపరీక్ష సందర్భంలో ప్రొటెం స్పీకర్‌ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా జాతీయగీతాన్ని అవమానించి ఘోరతప్పిదం చేశారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ గుర్తుచేశారు. ‘‘మీరంతా టీవీల్లో గమనించే ఉంటారు.. జాతీయగీతం ఆలపించడానికి ముందే ప్రొటెం స్పీకర్‌, బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా సీట్లలో నుంచి లేచిపోవడాన్ని చూసేఉంటారు. ఆ చర్యతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ దేశవ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. కర్ణాటక బలపరీక్షలో బీజేపీ ఓటమిపై స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలాతో కలిసి శనివారం రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు.
(చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప)

‘‘ఇదే..దీని గురించే మా పోరాటమంతా. ఈ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు జాతీయగీతం పట్ల గౌరవంలేదు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టదు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. కాబట్టే మేం జనంతో కలిసి మేము గట్టిగా పోరాడుతున్నాం. బలం లేకపోయినా యడ్యూరప్పను సీఎం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకునే వ్యవహారానికి తెరలేపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలోగానీ, మొన్న గోవా, మణిపూర్‌లలోగానీ వీళ్లు ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకునేందుకు యత్నించారు. జాతిని కల్లోలం వైపునకు నెడుతోన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం. కర్ణాటక పరిణామం వాళ్లకొక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విజయంసాధించిన జేడీయూ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు, దేవేగౌడ గారికి, ప్రత్యేకించి కన్నడిగలకు నా అభినందనలు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.
(చూడండి: కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!)

ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష.. యడ్యూరప్ప నిష్క్రమణతో ఊహించని మలుపు తిరిగినట్లైంది. డివిజన్‌ ఓటింగ్‌కు ఆదేశించకముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ కసరత్తు ప్రారంభించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top