కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా? | Bandaru Dattatreya Open Letter to KTR | Sakshi
Sakshi News home page

జేపీ నడ్డా తెలియకపోవడం విడ్డూరం..

Aug 20 2019 8:49 PM | Updated on Aug 20 2019 8:52 PM

Bandaru Dattatreya Open Letter to KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌కు దత్తాత్రేయ బహిరంగ లేఖ విడుదల చేశారు. 

2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ దేశ మన్ననలు పొందుతుంటే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆపేయడంతో మధ్యతరగతి రోగులు రోడ్డు మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 35 వేల కోట్లకు పెంచారని, గొర్రెల పంపిణీలో రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని కలెక్టర్లతో విచారణ జరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మార్చుతామని చెప్పి మురికికూపంగా మార్చారని విమర్శించారు. ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం 28 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. జేపీ నడ్డాపై నిందలు మోపడం చూస్తుంటే కేటీఆర్‌కు బీజేపీ జ్వరం పట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement