చిన్నల్లుడిదే పైచేయి

Balakrishna Son In Law Sri Bharat Hopes On Vizag MP Ticket - Sakshi

వైజాగ్‌ బరిలో శ్రీభరత్‌ 

బాలయ్య అల్లుళ్ల టికెట్ల యుద్ధం 

ఎంపీ టికెట్‌ ఇవ్వాల్సిందేనని పంతం  

లోకేష్‌ పోటీ చేస్తే ఇచ్చేది లేదన్న చంద్రబాబు 

ఎట్టకేలకు లోకేష్‌ మంగళగిరికి మార్పు 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో టికెట్ల యుద్ధం మొదలైంది. ఈ జాబితాలో బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్‌ కూడా చేరిపోయారు. ఈ హైడ్రామాలో చిన్నల్లుడిదే పైచేయి అయింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్, చిన్నల్లుడు, గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు శ్రీభరత్‌ పోటీ పడుతూ వచ్చారు. లోకేష్‌ను తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు టికెట్‌ ఆశిస్తున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నేత, ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అధినేతతో చంద్రబాబు.. మీరెవరూ ఆశలు పెట్టుకోకండి. లోకేష్‌ను పంపిస్తున్నాను.. గెలిపించి పంపండి అని  సూచించారు.  దీంతో అక్కడ లోకేష్‌ పోటీ చేయడం ఖాయమైంది. ఈ  నేపథ్యంలో విశాఖ లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న లోకేష్‌ తోడల్లుడు ఎం.శ్రీభరత్‌ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజులుగా అమరావతిలో మకాం వేశారు.

రెండురోజుల కిందట చంద్రబాబును కలిసి తన టికెట్‌ గురించి ఏం చేశారని ప్రశ్నించారు.  దీనిపై చంద్రబాబు... లోకేష్‌ వస్తున్నప్పుడు నువ్వు ఎలా పోటీలో ఉంటావు? ఈసారికి వద్దు.. గంటా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయిస్తానని స్పష్టం చేశారు. దీనిపై భరత్‌  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతి చెందిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నా వద్దని నిరాకరించి ఎంపీగా పోటీ చేసేందుకే తాను సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశారు.  అయితే ఇప్పుడు  లోకేష్‌ కోసం తనను పక్కనపెట్టడాన్ని భరత్‌ జీర్ణించుకోలేక పోయారు. దీంతో బాలకృష్ణ రంగంలోకి దిగి బావ చంద్రబాబుతో చర్చలు జరిపారు.  తొలుత చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. అవసరమైతే భరత్‌ను రాజమండ్రి ఎంపీగా పంపిస్తానని చెప్పగా ఈ ప్రతిపాదనను  భరత్‌ వ్యతిరేకించినట్టు చెబుతున్నారు.

ఎలాగైనా తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, అవసరమైతే లోకేష్‌ను కూడా భీమిలి లేదా విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేయించుకోవచ్చని సూచించారు. అయితే ఇందుకు బాబు అంగీకరించలేదు. విశాఖ లోక్‌సభ, నార్త్, ఈస్ట్‌ (సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు)  ఈ మూడూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించలేమని బాబు వాదించినప్పటికీ భరత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలిసింది. దీంతో  బాలకృష్ణ మరోసారి చంద్రబాబుతో మాట్లాడి లోకేష్‌ను ఎక్కడికైనా పంపించొచ్చు.. భరత్‌కు విశాఖనే ఇవ్వాలని పట్టుబడినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు చివరికి లోకేష్‌ను మంగళగిరికి పంపడంతోపాటు శ్రీభరత్‌కే విశాఖ లోక్‌సభ టికెట్‌ ఖరారు చేసినట్టు చెబుతున్నారు.    

ఎంపీ టికెట్‌ నాదే : భరత్‌ 
‘‘లోకేష్‌ విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేసినా నేను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నా. ఇద్దరమూ అక్కడి నుంచి పోటీ చేసినా తప్పు లేదు. టికెట్‌ నాకే వస్తుందని అనుకుంటున్నా’’ అని భరత్‌ సాక్షి ప్రతినిధితో  స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top