ప్రకాశం ప్రథమం

Andhra Pradesh Election Voting First In Prakasam - Sakshi

పోలింగ్‌ శాతంలో మనమే ఫస్ట్‌

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానం

ఈ దఫా ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌ల వినియోగం

మీట నొక్కగానే స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, గుర్తు ప్రత్యక్షం

ప్రజల్లో ఓటు సక్రమంగా పడిందన్న సంతృప్తి

పోలింగ్‌ సరళిపై చంద్రబాబు అండ్‌ కో దిగజారుడు వ్యాఖ్యలు

ఓటింగ్‌ శాతం పెరగడంతో టీడీపీకి ముచ్చెమటలు

ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై పనిగట్టుకొని విమర్శలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు సిటీ: ప్రకాశం ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆరంభంలో యంత్రుడు మొరాయించినా.. పోలింగ్‌ ఆలస్యమైనా.. భానుడు తన ప్రతాపం చూపినా.. ఉక్కపోత సహనాన్ని పరీక్షించినా ఓటరు వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో ఓపిగ్గా వేచి చూసి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా ప్రజలు. ఓటేయాలన్న సంకల్పం ముందు చిన్నపాటి సమస్యలు ఓడిపోయాయి. గురువారం జరిగిన ఓట్ల పండగలో ఉదయం ఏడు గంటలకే గుంపులు గుంపులుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరారు.

ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.  పట్టణాలు, పల్లెలు.. చివరికి మారుమూల తండా వాసులు సైతం ఓటేసేందుకు ఉత్సాహం కనబర్చారు. 85.92 శాతం పోలింగ్‌తో ప్రకాశం ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. అద్దంకి నియోజకవర్గంలో పోలింగ్‌ భారీ ఎత్తున 89.82 శాతంగా నమోదైంది. దర్శిలో 89.62 శాతం నమోదైంది. జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు రాష్టంలో ప్రథమ, తృతీయ

స్ధానాల్లో నిలవడం గమనార్హం. ఏ నియోజకవర్గంలోనూ 80 శాతానికి తక్కువగా పోలింగ్‌ నమోదు కాలేదు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జిల్లాలోనూ ఓటింగ్‌ శాతం పెరిగింది. 2014 ఎన్నికలలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 84.25 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా 2019 ఎన్నికల్లో  85.92 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.67 శాతం ఓటింగ్‌ పెరిగింది.

విమర్శలకు తావిచ్చిన చంద్రబాబు వ్యాఖ్యలు..
ఓటింగ్‌ సరళిలో వచ్చిన ఈ మార్పు చూసి టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగట్టుకొని విమర్శలు చేయడం ప్రారంభించారు. జిల్లాలోని ఓటర్లందరూ పారదర్శకతతో ఓటు హక్కును వినియోగించుకున్నామని సంబర పడుతుంటే చంద్రబాబు అండ్‌ కో మాత్రం వీవీఎంలు పనిచేయలేదని, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల కమిషన్‌ తో పాటు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండడం విడ్డూరంగా ఉంది.

ఈ ఎన్నికలు ఒక ఫార్స్‌ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించి విశ్లేషకులు, మేధావుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయనే కల్పించుకుంటున్నారు. అసలు సాంకేతికతను తీసుకొచ్చిందే తానని చెప్పే చంద్రబాబు ఈ వీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరుపై పనిగట్టుకొని విమర్శలు చేయడంపై సర్వత్రా విమర్శలున్నాయి. అసలు వేసిన ఓటు ఎవరికి పడిందో ఏమో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం మరింత దిగజారుడు తనమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి భయంతోనే  అడ్డగోలు విమర్శలు చేస్తున్నట్లే ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈసారి కొత్త టెక్నాలజీ..
2014లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో ఓటింగ్‌ పెట్టారు. ఓటర్లు నచ్చిన వారికి ఓటేశారు. కానీ వేసిన ఓటు సక్రమంగా పడిందా.. తాము వేసిన వారికి పడిందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. వేసిన ఓటు చూసుకొనే అవకాశమొస్తే బాగుండేదన్న అభిప్రాయం కలిగింది. 2019 ఎన్నికలలో ఆ కోరికా తీరింది.  తాము వేసిన ఓటు ఎవరికి వేశామో స్పష్టంగా తెలిసేలా ఎన్నికల అధికారులు వీవీప్యాట్‌లు ఏర్పాటు చేశారు. ఓటు మీట నొక్కగానే పక్కన స్క్రీన్‌పై ఓటు వేసిన అభ్యర్థి పేరు, ఆ పార్టీ గుర్తుతో సహా కనిపించింది. తాము అనుకున్న వారికి ఓటు వేశామన్న సంతృప్తి ఓటర్లలో కనిపించింది. అందుకే గురువారం నాటి పోలింగ్‌ లో తొలుత కొన్ని పోలింగ్‌ బూతులలో వీవీఎంలు మొరాయించినా ఓటర్లు ఓపిగ్గా వేచిఉండి ఓటు వేటేశారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిందో చూశామన్న సంతృప్తితో పోలింగ్‌ కేంద్రాల నుంచి వెనుదిరిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top