సభ ఎన్నాళ్లు?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

Akbaruddin Owaisi on Assembly meetings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఈ సభ ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరికీ తెలియదు. 15రోజులా.. 20 రోజులా లేక 25 రోజులా? ఎన్నిరోజులో తెలియకుండానే సభ నిర్వహ ణేంటి? బిల్లులు ఎప్పుడు ప్రవేశపెడతారు?’’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ నిలదీశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు.

ఒక చిన్న ప్రశ్నకు అధికార పక్షం సుదీర్ఘంగా మాట్లాడుతూపోతే ప్రశ్నలు ఇచ్చిన తాము ఏం కావాలని ప్రశ్నించారు. సభలో ప్రతిపక్షాలకు ఒక రూలు, అధికార పక్షానికి మరో రూలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రభుత్వ వ్యూహమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సభ నిర్వహణపై బీఏసీని పిలవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అందుకు సమ్మతించిన సభాపతి బీఏసీని పిలుస్తానని హామీ ఇచ్చారు.

ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: ఈటల
 ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ సభలో ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన ప్రశ్నలుండగా సమయం మించిపోతే ‘డీమ్డ్‌ టు బీ ఆన్సర్డ్‌’అంటూ వదిలేయడం తగదని, వాటిని వాయిదా వేసి తర్వాత అవకాశం కల్పించాలన్నారు.

మేడారం జాతరను కుంభమేళ తరహాలో కేంద్రం జాతీయ పండుగగా గుర్తించేలా సిఫార్సు చేయాలంటూ పలువురు సభ్యులు చేసిన సూచనపై ఈటల స్పందిస్తూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గిరిజన దేవాలయాలకు పూజారులుగా పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కోరగా ఈ అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top