నాణేలు.. ‘పది’వేలు

10 thousand rupee coins as Nomination Security Deposit in Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లో నామినేషన్‌ సెక్యూరిటీ డిపాజిట్‌గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్‌ పవార్‌ అనే అభ్యర్థి. ఇండోర్‌–3 అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి స్వర్ణిమ్‌ భారత్‌ ఇంక్విలాబ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్‌ నామినేషన్‌ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు.

దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శశ్వత్‌ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్‌కు అఖరు తేదీ కావడంతో పవార్‌ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్‌ సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్‌ పవార్‌ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు.

‘బుధ్నీ’కా రాజా!
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్‌పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజ్‌కుమార్‌ పటేల్‌పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top