
సాక్షి, అహ్మదాబాద్: త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసేందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులు ముందుకొస్తున్నారు. మైనారిటీ వ్యతిరేక ముద్రను తొలగించేందుకు 2011లో అప్పటి సీఎం మోదీ మైనారిటీలను ఆకర్షించేందుకు సద్భావన మిషన్‌ను చేపట్టారు. అయితే 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టికెట్లు దక్కకపోవడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అంతకుముందు 2010 స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ముస్లింలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. వీరిలో పలువురు స్థానిక ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ సద్భావనను ఆచరణలో చాటుకుంటుందని ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని ఆ పార్టీ మైనారిటీ నేతలు ఆశిస్తున్నారు.
1998 నుంచి కేవలం ఒక్క ముస్లిం అభ్యర్థికే బీజేపీ నుంచి అవకాశం లభిస్తుండటంతో ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చి పెద్దసంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బరిలో దింపాలని బీజేపీ మైనారిటీ మోర్చా డిమాండ్ చేస్తోంది. పార్టీకి మైనారిటీల మద్దతు కూడగట్టాలంటే ముస్లిం అభ్యర్థులను కదన రంగంలో దించాలని పార్టీ మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జ్ మెహబూబ్ అలీ చిస్తీ పేర్కొన్నారు. 2015లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ నుంచి 350 మంది ముస్లిం అభ్యర్ధులు ఎన్నికల్లో నిలిచారని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని అన్నారు.
ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పలువురు ముస్లిం నేతలు పార్టీ టికెట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. జమల్‌పుర్-ఖదియా, వెజాల్పూర్, వగ్రా, వాంకనెర్, భుజ్, అబ్ధాస సీట్లను ముస్లింలకు కేటాయించాలని కోరామన్నారు.