ఉద్వేగం నింపే జైలు కథలు
ఒక ఆదివాసి మహిళ తన గుడిసె బయట గిన్నెలో గంజి కాసుకొని, ఆకుకూరల కోసం అడవిలోకి వెళ్లింది.
ఏది నేరం ?! - హజారీబాగ్ జైలు గాథలు
రచన: బి.అనూరాధ పేజీలు: 142; వెల: 75; ప్రచురణ: విరసం ప్రతులకు: ప్రముఖ పుస్తక షాపులు
ఒక ఆదివాసి మహిళ తన గుడిసె బయట గిన్నెలో గంజి కాసుకొని, ఆకుకూరల కోసం అడవిలోకి వెళ్లింది. అంతలోనే ఒకమేక వచ్చి గిన్నెలోని గంజి తాగడానికి మూతి దూర్చడంతో తల ఇరుక్కొని చనిపోయింది. మేక యాజమాని నష్టపరిహారం కట్టించమన్నాడు. ఆమె డబ్బులు లేవంది. ఫిర్యాదు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమె చేయని నేరానికి జైలుకు వెళ్లింది - ఇదీ ‘మనిషి వర్సెస్ జంతువు’ కథ.‘ఏక్ చాదర్ మైలీసీ’లో సోనమ్‌కు భర్త చనిపోతే, మరిదితో మళ్లీ పెళ్లి చేశారు. భర్త చనిపోతే మరిదితో ‘చాదర్’ కప్పుతారు. ఆస్తికోసం మరిదితో కాపురం చేయాలి(ఉత్తరప్రదేశ్‌లో ఆచారం). మరిది భార్య కేసు పెడితే సోనమ్ జైలు పాలైంది.
ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న అనూరాధ అరెస్టయి, హజారీబాగ్ జైలులో నాలుగేళ్లు గడపకపోయివుంటే ఇలాంటి కథలు వెలుగులోకి వచ్చేవి కావు. అక్కడి మహిళా ఖైదీల కష్టాల్లో ఒకరై, వారిని ఓదార్చిన రచయిత్రిని వాళ్లు గుండెల్లో దాచుకున్నారు. తమ గాథలు వినిపించారు. ఆ కన్నీటి కథలే ‘హజారీబాగ్ జైలు గాథ’లైనాయి.
నేర అభియోగంతో ఏళ్ల తరబడి బెయిలుకు కూడా నోచుకోని మహిళా ఖైదీలు, వారితోపాటు వారి చిన్నారి పిల్లలు జైళ్లలో మగ్గుతున్నారు. మహిళా ఖైదీలలో ఆదివాసులు, పట్టణవాసులు, పైవర్గం మహిళలు, అక్రమ కేసుల మీద అరెస్టయి శిక్షలు పడినవాళ్లు, విచారణలో ఉన్నవాళ్లు ఉన్నారు.
1970-75 దాక మేరీ టైలర్ కూడా నక్సలైటు ఖైదీగా ఇదే జైలులో తన భర్త అమలేందుతో ఐదేళ్లపాటు విచారణ కూడా లేకుండా ఉన్నారు. అలా మహిళా ఖైదీల దుర్భర జీవితాలను పుస్తకంగా మలిచారు. చిత్రంగా 39 సంవత్సరాల తర్వాత, అనూరాధ కూడా రాజకీయ ఖైదీగా ఇదే జైలులో ఉన్నారు. ఆ అనుభవంతోనే తన సహచర మహిళా ఖైదీల గురించి సున్నితమైన పదహారు కథలు రాశారు.
- సీసీ 9705444534
విశ్వనాథ కథన కౌశలం
విమర్శలో ప్రతిభా నైపుణ్యం
ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం
రచన: డాక్టర్ వై.కామేశ్వరి
పేజీలు: 174; వెల: 100
ప్రచురణ: ఎమెస్కో
‘సైలాన్ మార్నర్‌లోని కథా నిర్మాణం, కాళిదాస భవభూతులలోని శిల్పం, టాగూర్ ‘నౌకాడూబీ’లోని శరీరవాంఛాదూరమైన ప్రేమధర్మం, నా తెలుగు రచనా శక్తి- ఈ నాల్గింటిని కలిపి ఏకవీరగా చేశాను,’ అని విశ్వనాథ సత్యనారాయణ చెప్పుకున్నారు. 1905లో మధుర వచ్చిన క్రైస్తవ మత గురువు రాబర్డ్ డి.నోబిలి చారిత్రక దృష్టాంతమూ, నాయక కింగ్స్ ఆఫ్ మధుర, ఆరవీడు డైనాస్టీ ఈ రెండు ఆంగ్ల గ్రంథాల ఆధారాలతో 1929-31 కాలంలో విశ్వనాథ రెండవ నవల ‘ఏకవీర’ రాయబడింది. వంద పైచిలుకు పేజీల ఈ నవల పదిహేడుసార్లు పునర్ముద్రించబడింది. విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంతి సంవత్సరంలో వై.కామేశ్వరి సాధికార విమర్శ ‘ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం’ రెండు అధ్యాయాలు కలుపుకొని పునర్ముద్రణ కావడం విశేషం.
ఏకవీర నవల రూపుదిద్దుకోవడానికి ఆధారభూతమైన చారిత్రక సంగతులు, రామాయణ స్ఫూర్తి, స్పర్శ సిద్ధాంతం ఎలా ‘విశ్వనాథీకరణం’ చెందాయో సంస్కృత, ఇంగ్లీషు మూలాలతో విశ్లేషించారు కామేశ్వరి. ఏకవీర రచనాకాలం ముందు వెలువడిన నవలల తీరు పరిశీలించి, రాయప్రోలు భావనకు అర్థవంతమైన కొనసాగింపుగా రాసిన ఈ నవల లక్ష్యం మానవుల మధ్య సంబంధాలు మంచి మనుషుల మధ్య సంబంధాలుగా ఉండాలనేది, అని వివరించారు. ఏకవీరలో రెండు ప్రధాన పురుష పాత్రలు-స్త్రీల వ్యక్తిత్వాన్ని గౌరవించే, ఆంక్షలు పెట్టని అభ్యుదయ వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డాయని విడమర్చి చెప్పారు. తన అభిప్రాయాన్ని చెప్పగల గట్టి వ్యక్తిగా 1928-30 కాలంలో మీనాక్షి పాత్రను తీర్చిదిద్దటం గొప్ప విషయమంటారు. ఏకవీర పద ప్రయోగం గురించి ముందుమాటలో చేసిన వ్యాఖ్య ఆధారంగా లోతయిన జానపద విధాన పరిశోధన చేసి, విశ్వనాథ ప్రతిభకు దివిటీ పట్టారు.
కవిసమ్రాట్ రచించిన క్లాసిక్ నవల సినిమాగా ఎందుకు వైఫల్యం చెందిందో సాధికారకంగా చర్చించడమేగాక, ఈ నవలకు స్ఫూర్తి అయిన జార్జి ఇలియట్ నవల ‘సైలాన్ మార్నర్’ ‘బంగారుపాప’గా మాత్రం ఎందుకు విజయవంతమైందీ అంతే లోతుగా వివరించారు. ఏకవీర ఆలోచనతో రూపొందించబడిన నాలుగు స్తంభాలాట ఎలా విజయవంతమైందీ చెప్పారు. ఏకవీర నవల స్ఫూర్తిని గొప్పగా పట్టుకున్న దేవులపల్లి ‘ఎంతదూరము’ పాటను లోతుగా వివరించారు. ఆంగ్ల సాహిత్యంపై ఉన్న అధికారంతో ‘మ్యారేజ్ అ లా మోడ్’ రచయిత జాన్ డ్రైడెన్ సహా, షేక్‌స్పియర్, జాన్ మిల్టన్ వంటి మహామహులను ఉటంకించారు.
‘అసలు తెలుగు సాహిత్యానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఏమిటని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే, నేను విశ్వనాథ కథాకథనకౌశలము అని తటపటాయించకుండా చెప్పగలను’ అన్న మధురాంతకం రాజారాం అభిప్రాయంతో మొదలయ్యే ఈ విశ్లేషణ గ్రంథం - ఈ గ్రంథం చదివాక మరొకసారి ఏకవీర చదివితే విశ్వనాథ మౌలిక సృజనాత్మకత మరింత బాగా అనుభవంలోకి వస్తుందని ముగుస్తుంది.
- డా॥నాగసూరి వేణుగోపాల్
90440732392
ఊరి చివర ఇల్లు
చిన్న తాటాకిల్లు
ఊరికి దూరంగా, ఊర్లో మొగోళ్ళకి దగ్గరగా
గదిలో దీపం వెలుగుతోంది
ఆమె శరీరాన్నీ, మనస్సునీ చమురుని చేసి
నేలపై ఉన్న చిరిగిన గోనెసంచి
గోస చేస్తోంది గుర్తు తెలియని గాయాలకు
సంచిపై మాసిన దుప్పటి
దైన్యంగా చూస్తోంది, బలమైన మోకాళ్ళ దురాగతాలకి
ఆ గదికున్న కిటికీలు
ఏ ఆవేశాన్నీ, ఆక్రోశాన్నీ బయటకు పోనీవు
ఏ గాలినీ లోపలికి రానీవు
అక్కడ అవయవాలదే అధికారం
మనసెప్పుడూ అవ్యక్తం!
ష్! ఎవరో వచ్చినట్టున్నారు!
రండి, బయటకు పోదాం...
నాన్న కొడుకులు
వాడు ఉదయం నిద్రలేచినప్పుడు
రాత్రి నేను తొలిసారిగా తెచ్చిన
ఫుట్‌బాల్ చూసి...
ఆనందం అంతా
వాడి చేతిలోకి వచ్చినట్టు,
చిట్టి చేతులు
దానిని ఒడుపుగా పట్టుకుంటుంటే
ప్రపంచాన్ని తన చేతులలోకి తీసుకున్నట్లు,
దాంతో ఆడుకుంటుంటే
ఈ లోకాన్ని ఒక బంతిగా మార్చినట్లు,
ఏదో జయించినట్లుంది.
నా ఫుట్‌బాల్ అని గోల చేస్తుంటే
రాత్రి పడుకునేటప్పుడు కూడా
తన పక్కన పెట్టుకుని
నా ఫుట్‌బాల్ నా పక్కనే అంటుంటే
బాల్యం వెళ్లకుండా ఉంటే
బాగుండునేమో అనిపిస్తుంది.
నిద్దురలో ఫుట్‌బాల్ మీద
కాలేసి వాడు పొడుకుంటే
నాన్న మీద కాలేసుకొని పడుకున్న
నేనే నాకొక జ్ఞాపకం.
(నా చిన్నారి శివకార్తికేయ ప్రసాద్‌కి ఫుట్‌బాల్ కొన్నప్పుడు వాడి అనుభూతి)
- మార్టూరి శ్రీరామ్ ప్రసాద్
9490455599
ఈవెంట్
తప్తస్పృహ- తేజ పురస్కారాలు
తేజ ఆర్ట్ క్రియేషన్స్-శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో, మౌనశ్రీ మల్లిక్ కవితల సంకలనం ‘తప్తస్పృహ’ ఆవిష్కరణ, అంకితోత్సవం మే 11న సాయంత్రం 6:15కు త్యాగరాయ గానసభ, చిక్కడపల్లిలో జరగనున్నాయి. సి.నారాయణరెడ్డి, ఎన్.గోపి, కళా వేంకట దీక్షితులు, సుద్దాల అశోక్‌తేజ, బైస దేవదాసు పాల్గొంటారు. కృతి స్వీకర్తలు: మిర్యాల లలిత, దశరథ. ఇదే కార్యక్రమంలో తేజ పురస్కారాలను వనం శంకరయ్య, గుడిమెట్ల చెన్నయ్య, కె.విల్సన్‌రావు స్వీకరిస్తారు.
ఆకాశవాణిలో ‘పాపాఘ్ని కథలు’
వేంపల్లి గంగాధర్ రాసిన పాపాఘ్ని కథలను ఆకాశవాణి కడప కేంద్రం నుండి, మే 13 నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:30కు ధారావాహికగా ప్రసారం చేస్తున్నట్టు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎ.విజయభాస్కర్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఈ సంకలనంలో 30 కథలున్నాయి.
మూడు తరాల కవిసంగమం
మే 14న సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఈ నెల ‘కవిసంగమం’ కార్యక్రమం(సిరీస్-28)లో- పెన్నా శివరామకృష్ణ, అన్వర్, బిల్లా మహేందర్, యశోద పెనుబాల, పెనుగొండ బసవేశ్వర్ తమ కవితల్ని వినిపించనున్నారు. వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్, ఆబిడ్స్, హైదరాబాద్.
తె.సా.స. కవిత్వ పాఠశాల
తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో- మే 14, 15 తేదీల్లో ‘కవిత్వ పాఠశాల’ నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు కాంచనపల్లి తెలియజేస్తున్నారు. దర్భశయనం శ్రీనివాసాచార్య, వాడ్రేవు చినవీరభద్రుడు, సీతారాం, ఎన్.వేణుగోపాల్, ఎ.కె.ప్రభాకర్, నారాయణశర్మ, ఏనుగు నరసింహారెడ్డి యువకవులకు కవిత్వ మెళకువలు చెబుతారు. పాల్గొనదలచినవారు సంప్రదించాల్సిన ఫోన్ నం.: 9676096614
బ.ర.వే., ప.గో. సదస్సు
బహుజన రచయితల వేదిక, పశ్చిమ గోదావరి జిల్లా సాహిత్య సదస్సు మే 15న ఉదయం 10 గంటలకు తణుకులోని సురాజ్య భవన్‌లో జరగనుందని కన్వీనర్ కె.సీహెచ్.పెద్దిరాజు తెలియజేస్తున్నారు. జి.రాజశేఖర్, బొనిగల రామారావు, కొల్లబత్తుల సత్యం, అరుణ గోగులమండ, నూకతోటి రవికుమార్, బండి సత్యనారాయణ, ముప్పవరపు కిశోర్, నేతల ప్రతాప్‌కుమార్, ఎంఆర్‌జె.నందాలు ప్రసంగిస్తారు. మనువాదం వర్సెస్ బహుజనవాదం అంశంపై కవిసమ్మేళనం; స్వాప్నికుడి మరణం(సంకలనం), మూలవాసి(రసూల్‌ఖాన్), బహుజనిజం(అంకం ఏసురత్నం), కట్టుబాట్లు(పొలిమాటి రాంబాబు) పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటాయి.
సూర్యోదయం కుట్రకాదు ఆవిష్కరణ
తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, మెమోరియల్ కమిటీల ఆధ్వర్యంలో మే 15న ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం, జిల్లా పరిషత్ కొత్త అసెంబ్లీ హాల్‌లో జరగనున్న తరిమెల నాగిరెడ్డి శతజయంతి సభలో ‘సూర్యోదయం కుట్రకాదు’(సంపాదకుడు: చెరుకూరి సత్యనారాయణ) ఆవిష్కరణ జరగనుంది. దుప్పల గోవిందరావు, చౌదరి తేజేశ్వరరావు, చాపర వెంకటరమణ, పైలా చంద్రమ్మ, తాండ్ర ప్రకాష్, నంబళ్ల అప్పలాచారి, డి.వర్మ, ఇమామ్ పాల్గొంటారు.
అజంతా పురస్కారం కోసం...
కవి అజంతా పేరుమీద ప్రతి యేటా ఇస్తున్న ‘అజంతా పురస్కారము’ కోసం, 2010 తర్వాత అచ్చయిన కవితాసంపుటాలను కవులు రెండు కాపీల చొప్పున మే 15లోగా పంపాలని వి.వి.రావు కోరుతున్నారు. ఎంపికైన కవిని పదివేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తారు. చిరునామా: ప్రిన్సిపల్, గీతమ్ స్కూల్, ఉప్పాడ బస్టాండ్ వద్ద, సి.బి.ఆర్.కాంపౌండ్, పిఠాపురం-533450
పాలమూరు సాహితీ అవార్డు కోసం...
2013, 2014, 2015 సంవత్సరాలకు ఒకేసారి ఇవ్వనున్న ‘పాలమూరు సాహితీ అవార్డు’ల కోసం ఆయా సంవత్సరాల్లో అచ్చయిన కవితాసంకలనాల ప్రతులను మూడేసి చొప్పున కవులు మే 31లోగా పంపాలని భీంపల్లి శ్రీకాంత్ కోరుతున్నారు. చిరునామా: 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్‌నగర్-1; ఫోన్: 9032844017


