పుస్తక పరిచయం | books intimacy | Sakshi
Sakshi News home page

పుస్తక పరిచయం

Aug 2 2015 3:43 AM | Updated on Sep 3 2017 6:35 AM

భారతీయ కథా ప్రతిబింబం పుస్తకంలో 38 అనువాద కథలున్నాయి

భారతీయ కథా ప్రతిబింబం


 ఈ పుస్తకంలో 38 అనువాద కథలున్నాయి. భాషల పరంగా చూస్తే, అధికంగా హిందీ(7), ఇంగ్లిష్(7), తమిళం(5) నుంచి తీసుకున్నవి; తర్వాత, మలయాళం(4), మరాఠీ(4), బెంగాళీ(3), ఉర్దూ(3), కన్నడ (2), గుజరాతీ(1), పంజాబీ(1), సింధీ(1) నుంచి ఎంపిక చేసుకున్నవి. రచయితల పరంగా లెక్కిస్తే, ఆర్కే నారాయణ్‌వి 3 (ఇంగ్లిష్), జయకాంతన్‌వి 3 (తమిళం), వైకోం బషీర్‌వి 3 (మలయాళం), అజ్‌గర్ వజాహత్‌వి 2 (ఉర్దూ), కుం.వీరభద్రప్పవి 2 (కన్నడ) కథలున్నాయి. టాగోర్, సత్యజిత్ రే, మహాశ్వేతాదేవి, ముల్క్‌రాజ్ ఆనంద్, సి.రాజగోపాలాచారి, కుశ్వంత్ సింగ్, ఎకె రామానుజన్, ప్రేమ్‌చంద్, తకళి శివశంకర పిళ్లై, సాదత్ హసన్ మంటో, అశోక్ మిత్రన్, బ్రిజ్ మోహన్ లాంటివాళ్లు ఒక్కో కథతో ఇందులో పరుచుకున్నారు. ఈ లెక్కలు కథల చిక్కదనాన్ని పట్టించేవి కాకపోయినా, వాటికవే చెప్పే అంశాలు ఉండకపోవు! దేవరాజు మహారాజు చేతిరాతంత ముద్దుగా ఈ అనువాదాలు సాగినై.
 -శేషసాయి
 భారతీయ కథా ప్రతిబింబం (అనువాద కథలు)
 అనుసరణ: డాక్టర్ దేవరాజు మహారాజు
 పేజీలు: 254; వెల: 160; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఐ. పోస్ట్, హైదరాబాద్-68; ఫోన్: 040-24224458
 
 కమ్యూనిస్టు మానిఫెస్టో


 ‘ఇప్పటివరకూ నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే’ అనే వాక్యంతో మొదలై, ‘సకల దేశాల శ్రామికులారా, ఏకంకండి!’(మరో అనువాదం ప్రకారం, ప్రపంచ కార్మికులారా ఏకంకండి.) అనే వాక్యంతో ముగిసే 1848 నాటి ఈ డాక్యుమెంటును తగినన్ని వివరణలతో ‘కామ్రేడ్ కొల్లా వెంకయ్య మెమోరియల్ లైబ్రరీ, పెదనందిపాడు’ పునర్ముద్రించింది.
 ‘... కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని ఒక్క వాక్యంలో క్లుప్తీకరించవచ్చు; సొంత ఆస్తిని రద్దు చేయడమే వారి సిద్ధాంతం’.  ‘బూర్జువా సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది. కమ్యూనిస్టు సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తుంది’.
 ‘ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి అయ్యేకొద్దీ కార్మికుని నైపుణ్యానికీ, శారీరక శక్తి వినియోగానికీ ప్రాముఖ్యం తగ్గిపోతుంది; వాటి ప్రాముఖ్యత తగ్గేకొద్దీ యజమానులు పురుషులను తొలగించి స్త్రీలను పనిలో పెట్టుకుంటారు. లింగ వయోభేదాలు కార్మిక వర్గానికి ఇంక ఎంతమాత్రమూ ప్రత్యేక ప్రాముఖ్యత గల సామాజిక అంశాలుగా వుండవు’. తవ్వినకొద్దీ లోతు తెలిసే ఈ చిరుపొత్తాన్ని కమ్యూనిస్టేతరులు కూడా దానికున్న చారిత్రక విలువ దృష్ట్యా చదవొచ్చు.
 -నీలిమ


 కమ్యూనిస్టు మానిఫెస్టో; రచన: కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్; తెలుగు: రాచమల్లు రామచంద్రారెడ్డి; పేజీలు: 80; వెల: 10; ప్రతులకు: డాక్టర్ కొల్లా రాజమోహన్, చిలకలూరిపేట, గుంటూరు-522616; ఫోన్: 9000657799
 
 తల్లీ నిను దలంచి...


 అమ్మ అనే రెండు అక్షరాల్లో వేనవేల మహాకావ్యాలున్నాయి. ఎంత గొప్ప వ్యక్తి అయినా, అమ్మ గురించి మాట్లాడినప్పుడు చిన్నపిల్లాడై ఆమె ఒడిలో చేరుతాడు.  అందుకే, సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు ‘స్త్రీమూర్తి గౌరవం పెంచేలా’ సంకలనం చేసిన ‘అమ్మ’ వ్యాససంపుటి చదువుతుంటే, వ్యాసకర్తల జ్ఞాపకాల వరుసలో మన జ్ఞాపకాలు కూడా నిల్చుంటాయి.
 నరేంద్ర మోది, నారా చంద్రబాబునాయుడు, దాసరి నారాయణరావు, పురంధరేశ్వరి,  కె.రామచంద్రమూర్తి, బాపు, మోహన్ కందా, చిరంజీవి, గద్దర్, భానుమతీ రామకృష్ణ, కృష్ణ, మంగళంపల్లి బాలమురళీకృష్ఱ, వరప్రసాద్‌రెడ్డి, దేవీప్రియ, మేడసాని మోహన్ మొదలైన లబ్ధప్రతిష్ఠులు వివిధ సందర్భాల్లో ‘అమ్మ’ గురించి రాసిన, చెప్పిన 45 వ్యాసాలు, కవితలు ఇందులో ఉన్నాయి. కొన్ని ఈ పుస్తకం కోసమే ప్రత్యేకంగా రాయించినవి! వ్యాసకర్తలు వివిధ రంగాలకు చెందిన వాళ్లు కావచ్చు. ఎవరి భావజాలాలు వారికి ఉండవచ్చు. ఈ భిన్నమైనవన్నీ ‘అమ్మ’ అనే పదంతో సమమైపోతాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే!  ఎవరికైనా అమ్మే!! అనిపిస్తుంది పుస్తకం పూర్తయ్యాక.

-రఘువీర్

అమ్మ; సంకలనం: నడింపల్లి సీతారామరాజు; పేజీలు:160; వెల: అమూల్యం; ప్రతులకు: సంకలనకర్త, బల్లాడ్ లివింగ్స్ అపార్ట్‌మెంట్, కె.కె. నగర్, పి/హెచ్, హబ్సిగూడ-3, హైదరాబాద్-7; ఫోన్: 9848134019

 

 కొత్త పుస్తకాలు
 
 1.శారద రచనలు (మొదటి సంపుటం-నవలలు; ఏది సత్యం, అపస్వరాలు, మంచీ-చెడూ)
 పేజీలు: 498; వెల: 325
 2.ప్రేమ్‌చంద్ సాహిత్య వ్యాసాలు
 పేజీలు: 112; వెల: 70
 3.ఆదిమ కమ్యూనిజము నుండి బానిస సమాజము వరకు భారతదేశం
 రచన: శ్రీపాద అమృత డాంగే
 తెలుగు: పులుపుల వెంకటశివయ్య
 పేజీలు: 230; వెల: 150
 4.గతి తార్కిక భౌతికవాదం-చారిత్రక భౌతికవాదం (మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతం)
 తెలుగు: నిడమర్తి ఉమారాజేశ్వరరావు
 పేజీలు: 342; వెల: 200
 5.భూస్వామ్య విధానం రద్దుకై రైతుల వీరోచిత తిరుగుబాటు- చరిత్రాత్మక తెలంగాణ సాయుధపోరాటం
 రచన: సీహెచ్.రాజేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, వై.వి.కృష్ణారావు
 పేజీలు: 102; వెల: 70
 ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68; ఫోన్: 24224458
 

 

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement