అబ్రాడ్‌ టు హైదరాబాద్‌

NRIs Interested On Vote Right From Abroad - Sakshi

ఓటు వేసేందుకు విదేశాల నుంచి వచ్చిన నగరవాసులు  

ఓటేసేందుకు ఆసక్తి చూపిన ఎన్‌ఆర్‌ఐలు

సాక్షి,సిటీబ్యూరో: ఇంటికి దగ్గరగా పోలింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నా... ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు.  అయితేకొందరు ఎన్‌ఆర్‌ఐలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి వచ్చారు. ఒక్క ఓటు కదా.. ఏం వేస్తాం అని వారు అనుకోకుండా ఓటు వేసి  ఆదర్శరంగా నిలిచారు.∙ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని చిక్కడపల్లికి చెందిన బండి అభినయ్‌(35) పదిహేనేళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం అమెరికా వెళ్లారు. సాల్ట్‌ లేక్‌ సిటీలో నివసిస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన పరికరాల వ్యాపారంతో పాటు వివిధ ప్రాంతాల్లో హోటళ్లను నిర్వహిస్తున్నారు.

మొట్ట మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ గతంలోనే ఓటు వచ్చిందని, కానీ వినియోగించుకోలేదన్నారు.
మదీనగూడ దీప్తిశ్రీనగర్‌కు చెందిన శ్రీనివాస్, ప్రసన్న దంపతుల కుమార్తె డాక్టర్‌ నిషిత అమెరికాలోని ఓక్లహోమా యూనివర్సిటీలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలోనే తనకు ఓటు హక్కు వచ్చినా,  అప్పట్లో వినియోగించుకునే అవకాశం లభించలేదు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలనే  సంకల్పంతో స్వదేశానికి వచ్చారు.   
సీతాఫల్‌మండికి చెందిన సత్య ప్రకాష్‌ వత్తిరీత్యా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణలో  జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా వెళ్లి ఓటు వేయాలని సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన విలువైన ఓటును వినియోగించుకున్నారు.  
సరితగౌడ్‌ అనే యువతి కూడా దక్షిణాఫ్రికా నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top