మందిర నిర్మాణం మరవొద్దు

vhp heavy rally in delhi ramlila maidan - Sakshi

 చట్టం తీసుకురండి

‘అయోధ్య’పై హిందూ సంస్థల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

ఢిల్లీలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్‌ పరివార్‌ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు.

కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్‌ వద్దు. టెంపుల్‌ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌) సీనియర్‌ నాయకుడు సురేశ్‌ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర

అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు.

‘మోదీని వదిలిపెట్టం’
హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు.  హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్‌ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు.  వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్‌ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top