అంతా బాగుండాలి.. అందులో మీరూ ఉండాలి

Union Budget 2020: Nirmala Sitharaman Comments About Womens - Sakshi

బడ్జెట్‌ ‘రచ్చ’బండలో సీతారామన్‌ బాణాలు

అదిగో... అదిగో..! అందరూ వచ్చేశారా!! ప్రతిసారీ ఈ రోజున మనం ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నాం. ఈసారి ఈ రచ్చబండ దగ్గర!!. ఎన్నో కోరికలు కోరి... అవి తీరుతాయన్న ఆశతో మీరిలా రావటం... అన్నీ సాధ్యం కాకున్నా కొన్నిటినైనా నెరవేర్చడానికి నేను ప్రయత్నించటం కొత్తేమీ కాదుగా!!. ఈసారి మన ఊరి పరిస్థితులు అంత బాగాలేవు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య లంకె కుదరటం లేదు. ధరలు పెరుగుతున్నాయి. వాటి మాదిరే అప్పులు కూడా!!. అలాగని ఖర్చులు మానుకోలేం కదా? మీరంతా బాగుండాలని నా ప్రయత్నమైతే నేను చేశా.. ఇదిగో చెబుతా వినండి!!.

రైతన్నా... నేనున్నా 
నీకు విత్తులేసే నాటికి చేతిలో పైకం ఉండాలి. బ్యాంకులకు చెప్పాంలే!! దండిగా రుణాలివ్వమని. ఓ రెండేళ్లలో నీ చేతిలోకి రెండింతల సొమ్ము వచ్చేలా చేయాలన్నదే నా కల. అందుకోసమే ఇదంతా!!. మీరు సోలార్‌ పంపుసెట్టు పెట్టుకోండి. దానిక్కాస్త డబ్బులిస్తాం. అంతేకాదు!! పంటతో పాటు కరెంటూ పండించండి!!. ఆ కరెంటును మేం కొని డబ్బులిస్తాం. నీటి కష్టాలు లేకుండా చేస్తాం. మరి మీరు కూడా నీళ్లు, ఎరువులు తక్కువ వాడాలి సుమా!. మీరు పండించే వస్తువులు పాడైపోకుండా రవాణా చెయ్యటానికి కోల్డ్‌ స్టోరేజీ రైళ్లు మరిన్ని తేవటానికి ప్రయత్నిస్తాం. మీ రైతాంగానికిచ్చే నిధులు కూడా భారీగానే పెంచాంలే!!. 

నేను సీతయితే... నువ్వు లక్ష్మి మరి 
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలంటే ధన లక్ష్ములే కాదు! ధాన్య లక్ష్ములూ కావాలి!!. అందుకే విత్తనాలు నిల్వ చేయండి. స్టోరేజీలకు కావాల్సిన అప్పులు మేం ఇప్పిస్తాం. గిడ్డంగులూ మేమే కట్టిస్తాం. మీ పంట ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకే కాదు... విదేశాలకూ పంపించొచ్చు. ఆడపిల్లల పెళ్లికి  కనీస వయసు పెంచాలని ఉంది. దానికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ పెడతాం. అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు కూడా ఇస్తున్నాం. 

పన్ను తగ్గింపు కావాలా.. నాయనా!! 
మీ ఉద్యోగులెప్పుడూ ఇంతే! పన్ను రేట్లు తగ్గించండని అడుగుతూనే ఉంటారు!!. అదెలా కుదురుతుంది? మీరు పన్నులు కడితేనేగా ఊరికి ఆదాయం వచ్చేది. అయినా సరే... మీరు అడుగుతున్నారు కనక ఏదోకటి చేశాలే!!. మీలో కొందరేమో పొదుపరులు. కొందరేమో వచ్చింది వచ్చినట్లే ఖర్చుపెట్టేస్తారు. అందుకే.. మీ ఇద్దరినీ వేరు చేసి మీకు తగ్గ పన్ను విధానాలు తెచ్చాను. మీరు పొదుపు చేసుకుంటే మీకు మునుపటిలానే పన్ను ఎలాగూ కాస్త మినహాయిస్తాం. ఖర్చు పెట్టేవాళ్లకు మినహాయింపులుండవు కనక పన్ను రేట్లు తగ్గించాం. ఇది ఎవరికి లాభమని మాత్రం నన్ను అడక్కండి. మాక్కూడా లాభం ఉండాలిగా!!. 

కార్పొరేట్లూ... ఇంకా ఎంత తగ్గిస్తాం? 
బడ్జెట్‌ కోసం మీరు ఎదురు చూడటమే సరికాదు. ఎందుకంటే మొన్నేగా మీ పన్ను తగ్గించింది!!. అసలు ప్రపంచం మొత్తమ్మీద కంపెనీలకు తక్కువ పన్నులున్నది ఇక్కడే తెలుసా? ఇంకా ఎంత తగ్గిస్తాం చెప్పండి!!. మీరిప్పుడు డివిడెండ్లు ఇస్తూ... వాటిపైనా పన్ను చెల్లించాల్సి వస్తోంది కదా? దాన్ని... అదే డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను తీసేస్తున్నాం లెండి. కాకపోతే ఇకమీదట డివిడెండ్‌ తీసుకునే వాళ్ళు పన్ను కడతారు. ఇద్దరూ కట్టకపోతే ఎలా చెప్పండి?  

సురక్షితంగా దాచుకోండి... బ్యాంకుల్లో 
పాపం! బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కానీ మీ భయం మీకుంటుంది!!. ఏ బ్యాంకు ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో తెలీదు. అందుకే... ఇకపై మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షలవరకూ బీమా ఉండేలా చూస్తాం. ఇప్పటిదాకా ఇది లక్ష రూపాయలే కదా!!. అలాగని మీరు చేసే డిపాజిట్లన్నిటికీ 5 లక్షల చొప్పున గ్యారంటీ ఉంటుందనుకోకండి. మీరు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు చేసినా... ఒక మనిషికి రూ.5 లక్షల వరకే బీమా ఉంటుంది. అది కాస్తా చూసుకోండి!!.

చిన్న కంపెనీకి... చింతలుండవు 
మరీ పెద్ద కంపెనీలు కాదుగానీ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలన్నిటికీ ఇది మంచి వార్తే లెండి!!. మీ టర్నోవర్‌ రూ.5 కోట్ల లోపుంటే మీకు ఆడిటింగ్‌ అవసరం లేదు. ఇపుడు కోటిదాటితే ఆడిట్‌ చేయాల్సి వస్తోంది కదా? దీన్ని సవరించాం. ఎందుకంటే ఎకానమీ బాగుండాలంటే మీరే ముందుండి నడిపించాలి. మీకు తక్కువ వడ్డీ రేటుండే రుణాలివ్వటానికి (సబార్డినేట్‌) కూడా మరో పథకం తెస్తున్నాం. మీకు రుణ పునరుద్ధరణ సదుపాయ విండోను 2021 మార్చి వరకు కొనసాగించాలని ఆర్‌బీఐని అడిగాం. రేపో మాపో ఊ కొడుతుంది లెండి!!. 

విద్యార్థులూ... టూరిస్టులూ 
రవాణా ఎంత ముఖ్యమో మీకు తెలుసు? కొత్త హైస్పీడ్‌ రైళ్లు... 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లూ తెస్తాం. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి చేస్తాం. హరియాణా, గుజరాత్, తమిళనాడు, అసోం సహా ఐదు చారిత్రక ప్రాంతాలతో పాటు రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం, అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం కడతాం. ఎంచక్కా మీరు వెళ్లి చూడొచ్చు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులొస్తాయి. 150 యూనివర్సిటీల్లో కొత్త స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు పెడతాం. జిల్లా ఆసుపత్రులన్నీ మెడికల్‌ కాలేజీలుగా మారుస్తాం.  

పెరిగేవి.. తగ్గేవి! 
ఎక్సైజ్‌ డ్యూటీని పెంచడంతో సిగరెట్లు, హుక్కా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. ఈ బాటలో సుంకాలు పెంచడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, ఫ్యాన్లు, టేబుళ్లు, ఫుట్‌వేర్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, బొమ్మలు, ఫర్నిచర్‌ తదితర ఇంపోర్టెడ్‌ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ జాబితాలో దిగుమతి చేసుకునే బటర్‌ నెయ్యి, పీనట్‌ బటర్,  చ్యూయింగ్‌ గమ్, షెల్‌తో ఉన్న వాల్‌నట్స్, సోయా ప్రొటీన్‌ చేరాయి. దిగుమతయ్యే ఫుట్‌వేర్, షేవర్స్, వాటర్‌ ఫిల్టర్, గ్లాస్‌వేర్, పింగాణీ పాత్రలు, జెమ్‌ స్టోన్స్, వాటర్‌ హీటర్లు, హెయిర్‌ డయ్యర్స్, ఎలక్ట్రిక్‌ ఐరన్స్, ఒవెన్స్, కుకర్స్, గ్రైండర్స్, కాఫీ, టీ మేకర్స్‌ ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే పీసీబీలు, మొబైల్‌ ఫోన్లు, డిస్‌ప్లే ప్యానళ్లు, మొబైల్స్‌లో వినియోగించే ఫింగర్‌ప్రింట్‌ రీడర్లు, ల్యాంపులు, లైటింగ్‌ ఫిట్టింగ్స్, స్టేషనరీ వస్తువుల ధరలు సైతం పెరగనున్నాయి. బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్, క్రీడా పరికరాలు, మైక్రోఫోన్, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు చౌక కానున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top