
సాక్షి,బెంగళూర్: టిప్పు సుల్తాన్‌ను ద్రోహిగా బీజేపీ అభివర్ణిస్తున్నక్రమంలో రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బ్రిటిష్ వారితో చారిత్రక పోరాటంలో టిప్పు సుల్తాన్ అసువులు బాశారని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. కర్నాటక విధాన సౌథ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ బ్రిటిష్ వారితో తలపడుతూ టిప్పు సుల్తాన్ వీరోచితంగా మరణించారని అన్నారు. యుద్ధ రంగంలో మైసూరు రాకెట్ల ప్రయోగంలో ఆయన దిట్టని అన్నారు. బీజేపీ వైఖరితో కోవింద్ వ్యాఖ్యలు విభేదిస్తుండటంతో ఇది హాట్ టాపిక్ అయింది. కోవింద్ వైఖరితో టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని చెబుతున్న కర్నాటక సర్కార్ వాదనకు బలం చేకూరుతుండటం బీజేపీ నేతలకు రుచించడం లేదు.
టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలకు కర్నాటక ప్రభుత్వ ఆహ్వానాన్ని బీజేపీ తోసిపుచ్చుతూ ఈ కార్యక్రమం సిగ్గుచేటని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఈ వేడుకులకు దూరంగా ఉండాలన్నది తమ పార్టీ వైఖరిగా బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకుడిగా వేలాది మంది హిందువులు, క్రిస్టియన్‌లను హతమార్చాడని,. బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడ్డాడని ఎమ్యెల్యే పేర్కొనడం పెను దుమారం రేపింది.
మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కర్నాటక సర్కార్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ జయంతోత్సవ వేడుకలు రాజకీయ అంశం కాదని, టిప్పు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నాలుగు సార్లు యుద్ధం చేశారని సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.