సురక్షిత నీటి ఖరీదు ఎంతో తెలుసా..? | Sakshi
Sakshi News home page

సురక్షిత నీటి ఖరీదు ఎంతో తెలుసా..?

Published Mon, Aug 28 2017 5:41 PM

సురక్షిత నీటి ఖరీదు ఎంతో తెలుసా..?

న్యూఢిల్లీః మానవాళి అంతటికి సురక్షిత నీరు అందించాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏటా రూ 95 లక్షల కోట్లకు పైగా వెచ్చించాలని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. చిన్నారులను వ్యాధుల బారి నుంచి కాపాడి, అకాల మరణాలను నిరోధించాలంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ముఖ్యంగా పేదలు సరైన నీరు, పారిశుద్ధ్య వసతులకు దూరంగా ఉన్నారని, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణం పూనుకోవాలని  వరల్డ్‌ బ్యాంక్‌కు చెందిన గ్లోబల్‌ వాటర్‌ ప్రాక్టీస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ గాంజె చెన్‌ పేర్కొన్నారు. పరిశుభ్రమైన నీటి సరఫరా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో 2030 నాటికి అందరికీ సురక్షిత నీరు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని వరల్డ్‌ బ్యాంక్‌ హెచ్చరించింది.
 
 అరక్షిత నీటితో డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని పిల్లల ఎదుగుదలపై ఇది పెనుప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాధులను, పోషకాహార లేమిని అధిగమించేందుకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలతో నీరు, పారిశుద్ధ్య మెరుగుదలను అనుసంధానించాలని వరల్డ్‌ బ్యాంక్‌ నివేదిక సూచించింది.

Advertisement
Advertisement