బెంగళూరు, మైసూర్‌లో ఉగ్రకదలిక | Sakshi
Sakshi News home page

బెంగళూరు, మైసూర్‌లో ఉగ్రకదలిక

Published Sat, Oct 19 2019 3:45 AM

Terror sleeper cells active in Bengaluru, Mysuru - Sakshi

మైసూరు: బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌ చురుగ్గా ఉన్నాయని, కర్ణాటక తీరం, బంగాళాఖాతం వెంబడి అవి తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌ జమాత్‌–ఉల్‌–ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ)కి చెందినవిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానిస్తోందని తెలిపారు. బెంగళూరు, మైసూరుల్లో కూడా స్లీపర్‌ సెల్స్‌ ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్త తీసుకోమని ఎన్‌ఐఏ సూచించిందన్నారు. కోస్టల్, ఇంటీరియర్‌ కర్ణాటకలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జేఎంబీ కార్యకలాపాలు విస్తరించిందని బొమ్మై హెచ్చరించారు.

ఈ సందర్భంగా అక్రమ బంగ్లాదేశీ వలసదారులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌)  ఎన్‌ఐఏతో కలసి పనిచేస్తుందని, నవంబర్‌ 1 నుంచి పని చేయడం మొదలుపెడుతుందని తెలిపారు. జేఎంబీ బృందాలు తమిళనాడులోని క్రిష్ణగిరి కొండల ప్రాంతాల్లో శిక్షణ పొందాయని, అక్కడ స్థావరం ఏర్పర్చుకొని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాలని చూశాయని ఎన్‌ఐఏ తెలిపింది. జేఎంబీ జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో విస్తరించిందని న్యూఢిల్లీలో జరిగిన ఏటీఎస్‌ సమావేశంలో ఎన్‌ఐఏ చీఫ్‌ వైసీ మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తన కోరలు విస్తరించాలని జేఎంబీ చూస్తోందని, ఇప్పటికే 125 మంది అనుమానితుల జాబితాను రాష్ట్రాలకు అందించామన్నారు. జేఎంబీ గ్రూప్‌ 2014 నుంచి 2018 మధ్య బెంగళూరులో 22 రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుందన్నారు. 

Advertisement
Advertisement