తుది వీడ్కోలు..!

Tamil Nadu Legendary Leaders The Funeral Procession At Marina Beach - Sakshi

మెరీనా తీరంలో మహాప్రస్థానాలు...

వ్యక్తి ఆరాధన తమిళనాట తీవ్రస్థాయిలో ఉంటుంది. తాము ప్రేమించేనేత మరణిస్తే తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అభిమానులు మృతిచెందిన సంఘటనలు గతంలో చూశాం. అలాగే ఆ నేతల చివరి చూపుల కోసం లక్షలాది మంది తరలివచ్చి అంతిమయాత్రల్లో పాల్గొన్న దృశ్యాలు తమిళనాడులో కనిపిస్తాయి. అభిమానం ఎంతగా ఉందంటే అన్నాదురై అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య గిన్నెస్‌బుక్‌లో కూడా రికార్డ్‌ అయ్యింది. అన్నా మొదలుకుని కరుణానిధి వరకు ఈ అంతిమయాత్రలు సాగిన తీరు ఇలా ఉంది. 

అన్నాదురై:
తమ భావాలు, అభిప్రాయాలతో, చేపట్టిన కార్యక్రమాలు, పనులతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన రాజకీయ ప్రముఖులు, నేతలకు మనదేశంలో నీరాజనాలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి నేతలు మరణించినపుడు వారి అంతిమయాత్రలో లెక్కకు మించి సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం తెలిసిందే. ద్రవిడోద్యమ దిగ్గజంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, తమిళ హక్కులు, సంస్కతి పరిరక్షణలో తుదికంటా పోరాడి తమిళనాడులోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన మాజీ సీఎం అన్నాదురై 59 ఏళ్ల వయసులో కేన్సర్‌తో మరణించారు. 1969 ఫిబ్రవరి 3న జరిగిన ఆయన అంతిమయాత్రకు కోటిన్నర మంది ప్రజలు హాజరుకావడంతో ‘అత్యధిక సంఖ్యలో ప్రజలు పలికిన తుది వీడ్కోలు’గా గిన్నెస్‌ ప్రపంచరికార్డ్‌ నమోదైంది. చెన్నైలో అన్నాదురై భౌతికకాయంతో కూడిన శవపేటికను లక్షలాది మంది అనుసరిస్తున్న ఫోటోలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి.

ఎంజీఆర్‌:
తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, భావజాల వ్యాప్తికి సినీమాధ్యమం ద్వారా కృషి చేసిన వారిలో అన్నాదురై, ఎం.కరుణానిధి, ఎంజీ.రామచంద్రన్‌ ప్రముఖులు. అయితే సినిమా తెరపై వాటిని తన నటనరూపంలో చూపి  ఎంజీఆర్‌ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎత్తిచూపుతూ, వారితో మమేకమయ్యేలా రూపొందించిన పాత్రలు (కథ,స్క్రీన్‌ ప్లే కరుణానిధి) ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేతో విభేదించి సొంతంగా ఏఐడీఎంకేను స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు.

కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకోలేదు. 1987 డిసెంబర్‌ 24న 71 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది. అంతిమయాత్రలో చెలరేగిన హింసలో 29 మంది మరణించారు. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక  30 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్‌ భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని అనుసరించినవారు, అంతిమయాత్రలో పాల్గొన్న వారు కలిపి దాదాపు పది లక్షల మంది ఉండొచ్చునని ఓ అంచనా.

జయలలిత: 
సినీనటిగా జీవితం ప్రారంభించిన జె.జయలలిత, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌ సన్నిహితురాలిగా మారి ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశారు. అటు ప్రతిపక్షపాత్రతో పాటు  సీఎం  పదవిని చేపట్టాక, అనేక సంక్షేమపథకాల అమలు ద్వారా పేదవర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. విప్లవనాయకి (పురచ్చి తలైవి)గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తమిళ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్నికల్లో గెలుపోటములు చవిచూశారు. మళ్లీ సీఎంగా  ఎన్నికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు.  అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన అంతిమయాత్రలో దాదాపు పదిలక్షల మంది పాల్గొన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 

కరుణానిధి:
తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేసిన మాజీ సీఎం ఎం.కరుణానిధి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఐదుసార్లు సీఎంగా, 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ పర్యాయం ఎమ్మెల్సీగా, దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన  ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.  మెరీనా బీచ్‌లోనే కరుణానిధి భౌతికకాయాన్ని ఖననం  చేసేందుకు డీఎంకే పట్టుబట్టడంతో ఈ అంశంపై కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది.

చివరకు న్యాయస్థానం దానికి అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలు వద్ద ఉంచిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందినట్టు పలువురు గాయపడినట్లు వార్తాసంస్థలు వెల్లడించాయి. అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన వారి నియంత్రణకు పోలీసులు లాఠీచార్జీ జరపడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత  ఈ అంతిమయాత్ర చెన్నై నగర వీధుల మీదుగా  మెరీనా బీచ్‌కు చేరుకుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నేతల్లో ఒకరైన కరుణానిధి అంతిమయాత్రలో లక్షల్లో  ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనావేస్తున్నారు. మెరీనా తీరంలోనే మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి పార్ధివదేహాన్ని కూడా ఖననం చేశారు.
- (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top