తమిళనాడు గవర్నర్‌ అనుచిత ప్రవర్తన

Tamil Nadu Governor Pats Woman Journalist On Cheek - Sakshi

చెన్నై : తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ అనుచిత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్ట్‌ పట్ల ఆయన ప్రవర్తించి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి పేర్కొనడంతో ఆయన ఇరుకున పడినట్లయింది. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్‌ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్‌ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పలువురు మహిళా పాత్రికేయులు కూడా పాల్గొన్నారు. సమావేశ ముగింపు సమయంలో వేదికపై నుంచి వస్తున్న గవర్నర్‌ను ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్‌ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకు ప్రయత్నించారు. తన పట్ల గవర్నర్‌ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్‌లో స్పందించారు.

‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’  అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌ ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’  అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ  రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం మంచి పద్థతి కాదంటూ ఆయన చర్యను ఖండించింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి.. ‘ ఆయన ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ గౌరవానికి అలా భంగం కలిగించడం సభ్యత అనిపించుకోదంటూ’ ట్వీట్‌ చేశారు.

విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్‌ అనుబంధ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర‍్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top