శరద్‌యాదవ్‌కు ఝలక్‌

Sharad Yadav May Have To Refund Salary If He Remains Disqualified - Sakshi

మీ వేతనాన్ని తిరిగివ్వాల్సి రావొచ్చు

అనర్హత కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, జేడీయూ బహిష్కృత నేత శరద్‌యాదవ్‌ అనర్హత కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ కేసులో తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రస్తుతం యాదవ్‌ అందుకుంటున్న వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి రావొచ్చని జస్టిస్‌ రాజీవ్‌ షక్ధర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొనడంతో శరద్‌యాదవ్, అన్వర్‌ అలీలను జేడీయూ సిఫార్సు మేరకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు 2017, డిసెంబర్‌ 4న అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ పూర్తయ్యేవరకూ ఎంపీలకు అందే అన్ని సౌకర్యాలను వీరిద్దరికీ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శరద్‌యాదవ్‌కు అందిస్తున్న సౌకర్యాలను తొలగించాలంటూ జేడీయూ రాజ్యసభ నేత రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానందున ఆయనకు ఎలాంటి వేతనం, అలవెన్సులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

వాదనలు విన్న జస్టిస్‌ రాజీవ్‌ తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను సింగిల్‌ జడ్జీ లేదా డివిజన్‌ బెంచ్‌లలో ఎవరికి అప్పగించాలన్న దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న యాదవ్‌ పదవీకాలం 2022లో, అన్వర్‌ పదవీకాలం వచ్చేఏడాదితో ముగియనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top