
లక్ష్యం చేరే దాకా పోరు: మురళీకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు ఆందోళనలు కొనసాగుతాయని, కేంద్రం కళ్లు తెరవకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ హెచ్చరించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు ఆందోళనలు కొనసాగుతాయని, కేంద్రం కళ్లు తెరవకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ హెచ్చరించారు. ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఏపీ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు గురువారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాదాపు 500 మంది ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో ఏపీ భవన్ పరిసరాలను హోరెత్తించారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు అక్కడే బైఠాయించి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు ‘రోల్‌బ్యాక్ యూపీఏ డెసిషన్’ అని రాసున్న రిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీమాంధ్రలో ప్రజలు రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. లక్ష్యం చేరే వరకు తమ పోరాటం ఆగదని ఉద్ఘాటించారు.
ఫోరం సెక్రటరీ కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రంలో అంధకారం అలుముకుందని దానిని తొలగించేందుకే తాము కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టామన్నారు. ర్యాలీకి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, లాయర్ల ఫోరం, ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఫోరం కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కో-చైర్మన్ మురళీ మోహన్, వైస్ చైర్మన్ టీ బెన్సల్, సెక్రెటరీ కేవీ కృష్ణయ్య, ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటరాంరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర లీగల్‌సెల్ అధ్యక్షుడు డీకేవీ ప్రకాశ్, ఢిల్లీ జేఏసీ నాయకులు సతీష్, రాజేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. దీనికిముందు ఫోరం నేతలు రాజ్‌ఘాట్, శక్తిస్థల్‌లను సందర్శించి శాంతియుతంగా ఉద్యమించే శక్తి నివ్వాలంటూ గాంధీ సమాధి వద్ద, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే బుద్ధిని సోనియాకు కల్పించాలని ఇందిరాగాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.
మిన్నంటిన నినాదాలు : ‘బచావో.. బచావో.. ఆంధ్రప్రదేశ్ బచావో..’ ‘రోల్‌బ్యాక్ యూపీఏ డెిసిషన్’ ‘కాంగ్రెస్ పార్టీ డౌన్..డౌన్.’ ‘ ఉయ్ వాంట్ జస్టిస్’ అన్న ఉద్యోగుల నినాదాలతో ఏపీభవన్ పరిసరాలు హోరెత్తాయి.
నేటి మహాధర్నాకు హాజరుకానున్న విజయమ్మ
విభజనకు వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధర్నాలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించనున్నారు. అదేవిధంగా ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు కూడా ధర్నాలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు ఏపీ భవన్ నుంచి ర్యాలీగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుంటారని ఫోరం చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు మహాధర్నా కొనసాగుతుందన్నారు.