
జవాను ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి ఓ మహిళను కాపాడారు.
ముంబై : ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటక‌్షన్ ఫోర్స్) జవాను ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి ఓ మహిళను కాపాడారు. ఈ సంఘటన ముంబైలోని కంజుర్మార్గ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గమ్యస్థానం రావడంతో రైలు నుంచి కిందకు దిగే సమయంలో ఓ మహిళ చీర బోగీ డోర్లో ఇరుక్కుపోయింది. అదే సమయంలో రైలు కదలడంతో మహిళ కిందపడిపోయింది. రైలు వేగం నిధానంగా పెరగడంతో చీరతో పాటూ మహిళ ఈడ్చుకుంటూ ముందుకు పోయింది.
ఇది గమనించిన వెనక బోగిలో ఉన్న జవాను వెంటనే కిందకు దిగి పరిగెత్తి మహిళను రైలుకు దూరంగా లాగారు. ఈ క్రమంలో జవాను కూడా కిందపడిపోయారు. జవాను సమయస్పూర్తితో వ్యవహరించడంతో మహిళ రైలుకు, ఫ్లాట్ ఫామ్‌కు మధ్య పడకుండా ప్రాణాలతో బయటపడింది. బాధితురాలిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ప్రాణాలకు సైతం తెగించి మహిళను కాపాడిన జవానును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీకెమెరాలో రికార్డయిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.