
అల్లర్ల కేసులో మోడీకి ఊరట
గుజరాత్‌లో 2002లో జరిగిన గోధ్రానంతర మత కల్లోలాల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఊరట లభించింది.
మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఆ నివేదికను ఆమోదిస్తూ తీర్పు వెలువరించిన స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు
అహ్మదాబాద్: గుజరాత్‌లో 2002లో జరిగిన గోధ్రానంతర మత కల్లోలాల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఊరట లభించింది. అప్పుడు జరిగిన అల్లర్లు, ఊచకోతలో మోడీ పాత్ర లేదంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సమర్పించిన తుది నివేదికను వ్యతిరేకిస్తూ జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను స్థానిక మెట్రోపాలిటన్ కోర్టు గురువారం కొట్టివేసింది. సిట్ తుది నివేదికను ఆమోదిస్తూ స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బీజే గణత్ర తీర్పునిచ్చారు.
‘పరిస్థితిని అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా సైన్యాన్ని దింపాలంటూ అభ్యర్థించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆయన కేబినెట్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ విషయంలో కుట్ర కోణాన్ని రుజువు చేయలేం. సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం ఘటన తరువాత హిందువులకు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కే అవకాశమివ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో మోడీ ఆదేశించారనడానికి సరైన ఆధారాలు లేవు’ అని ఆయన తీర్పులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో విధి నిర్వహణను మోడీ కావాలనే అలక్ష్యం చేశారని కూడా చెప్పలేమన్నారు. తన రాజకీయ జీవితంలో మాయని మచ్చలా మిగిలిన గోధ్రానంతర అల్లర్లకు సంబంధించి.. నరేంద్ర మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను ఈ తీర్పు ద్వారా కోర్టు సమర్థించినట్లైంది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీని నిందితుడిగా పేర్కొన్న ఏకైక పిటిషన్ ఇదే కావడం విశేషం. తీర్పు విన్న జాకియా(74) కన్నీటిపర్యంతమయ్యారు. ఈ తీర్పును నెల రోజుల్లోపల ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రకటించారు. తీర్పు అనంతరం ‘సత్యమేవ జయతే’ అంటూ మోడీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. తీర్పు వల్ల సిట్ ఇచ్చిన నిష్పక్షపాత దర్యాప్తు నివేదికకు కోర్టు ఆమోదముద్ర లభించిందని సిట్ తరఫు న్యాయవాది ఆర్‌ఎస్ జామూర్ పేర్కొన్నారు.
కేసు పూర్వాపరాలు: 2002 అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీ ఊచకోత సందర్భంగా 2002 ఫిబ్రవరి 28న జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 68 మంది దారుణ హత్యకు గురయ్యారు. ఆ అల్లర్లు, ఊచకోతలో ముఖ్యమంత్రి మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు సహా 63 మంది పాత్ర ఉందని ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ 2006లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో సుప్రీంకోర్టు సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్‌కే రాఘవన్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసి, జాకియా ఆరోపణల నిగ్గు తేల్చమని ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్.. 2010 మార్చిలో మోడీని కూడా దాదాపు పదిగంటల పాటు ప్రశ్నించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు.. రాజు రామచంద్రన్‌ను అమికస్ క్యూరీగా నియమించి, సిట్ దర్యాప్తుపై స్వతంత్ర విచారణ జరపాలంటూ ఆదేశించింది. ఆ నివేదిక అందిన తరువాత.. రెండు నివేదికలను పరిశీలించి తుది నివేదికను అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టులో సమర్పించాలని 2011 సెప్టెంబర్ 12న సిట్‌ను ఆదేశించింది. ఆ మేరకు 2012 ఫిబ్రవరి 8న సిట్ తమ తుది నివేదికను స్థానిక కోర్టుకు అందించింది.