ప్రగతికి ‘పట్టాలు’! | Railway Allocations in Union Budget 2019 | Sakshi
Sakshi News home page

ప్రగతికి ‘పట్టాలు’!

Feb 2 2019 2:55 AM | Updated on Feb 2 2019 10:26 AM

Railway Allocations in Union Budget 2019 - Sakshi

న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్‌ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్‌ గోయల్‌ చేర్చారు. అలాగే బడ్జెట్‌ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018–19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్‌గేజ్‌ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్‌ చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికి రైల్వేకు కేటాయించిన మూలధన వ్యయం చరిత్రలోనే అత్యధికం. 

ఆ మొత్తం రూ. 1.58 లక్షల కోట్లు. దేశీయంగా తయారైన పాక్షిక అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ 18) భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తిగా మన ఇంజినీర్లే తయారు చేసిన ఈ రైలుతో మనం సాంకేతికతలో మరో పెద్ద అడుగు ముందుకేశాం’అని వివరించారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్‌ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్‌ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నిష్పత్తి 96.2కు మెరుగుపడిందనీ, వచ్చే ఏడాదికి దీనిని 95 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గోయల్‌ చెప్పారు. 

త్వరలో అధునాతన బోగీలు 
ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్‌లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018–19 బడ్జెట్‌లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్‌లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది. దీంతో త్వరలోనే అధునాతన బోగీలు రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైలు బోగీల మార్కెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా 200 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాజా బడ్జెట్‌ కేటాయింపులు ఉపకరించనున్నాయి. భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్‌ 18 (వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌), కొత్త ఏసీ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు తదితరాల తయారీ విజయవంతం అవ్వడంతో అదే ఉత్సాహంతో 2021 వరకు తయారీ ప్రణాళికలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి సరిగ్గా అమలైతే వచ్చే రెండేళ్లలో దేశంలోని వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కలిసి దాదాపు 15 వేల బోగీలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో తిరుగుతున్న ఈమూ, మెమూ రైళ్లకు బదులుగా కొత్త బోగీలను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే మరో 6 ట్రైన్‌ 18లను తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఫస్ట్‌ యాక్సిడెంట్‌..
ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్‌ ఎంపీ. 1830 సెప్టెంబర్‌ 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్‌ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టన్‌ ఆర్థర్‌ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌
1850 తొలినాళ్లలో మన దేశంలో ఇలా ఎడ్లే ఇంజిన్లుగా అప్పటి న్యారో గేజ్‌ రైలును లాగేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement