పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి

Pulwama Terror Attack: Political leaders pay tribute to slain CRPF soldiers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అఖిలపక్షం ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్‌ రాథోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు అమరులకు ఘనంగా అంజలి ఘటించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల పార్థివదేహాలు శుక్రవారం సాయంత్రం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరాయి. విమానాశ్రయం ఎయిర్ బేస్‌లో అమరులకు నివాళులు అర్పించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని యావత్‌ భారతావని ముక్తకంఠంతో ఖండించింది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ... కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు.

అంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌ తదితరులు బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌లు తమ భుజాలకెత్తుకున్నారు. అనంతరం ఉగ్ర దాడిలో గాయపడి శ్రీనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన రాజ్‌నాథ్‌ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top