వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం

President Kovind to Unveil Atal Bihari Vajpayee's Life-Size Portrait in Parliament - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన వాజ్‌పేయి చిత్రపటాన్ని కోవింద్‌ మంగళవారం ఆవిష్కరించారు. సాధారణ వ్యక్తిగా వాజ్‌పేయి జీవించిన తీరు అందరికీ ఓ పాఠం లాంటిదని అభివర్ణించారు. హైవేల నిర్మాణంతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు.

  ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ఉంటాయని నమ్మే గొప్ప వ్యక్తి అటల్‌ అని ప్రశంసించారు. వాజ్‌పేయి ప్రసంగాల తీరు అద్భుతమని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వాజ్‌పేయి రాజకీయాల్లో ఆచరించిన విలువలను ప్రస్తుత తరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. వాజ్‌పేయి తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులపై ఎప్పుడూ పరుష పదజాలాన్ని ఉపయోగించలేదని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వాజ్‌పేయి చిత్రపటాన్ని తయారుచేసిన కృష్ణ కన్హయ్యను రాష్ట్రపతి సత్కరించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top