ఈ కేసుతో దావూద్‌కు ఏమైనా నేరుగా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : దోపిడీ, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి అభియోగాలపై దావూద్ ఇబ్రహీం చిన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసుకు సంబంధించి అండర్‌వరల్డ్ డాన్‌కు ఏమైనా నేరుగా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్టు థానే పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా స్థానిక రాజకీయ నేతలు, కార్పొరేటర్ల పాత్రపైనా నిగ్గుతేల్చనున్నట్టు తెలిపారు. మూడు నగరాలతో ముడిపడిన ఈ రాకెట్‌లో డ్రగ్స్ కోణం ఉండే అవకాశం ఉందని థానే పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ పేర్కొన్నారు.
ఇక దావూద్ సోదరుడు కస్కర్‌ను సోమవారం ఆయన బంధువుల ఇంటిలో 40 మంది సభ్యులుగల స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. కస్కర్ తన అన్న పేరు చెప్పి బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, గూండాలతో బిగ్‌షాట్స్‌ను బెదిరించేవాడని పోలీసులు చెప్పారు. కస్కర్ ముఠా ద్వారా థానే, ముంబయి, నవీ ముంబయిల పరిధిలో యధేచ్చగా దోపిడీ దందా సాగిందని తెలిపారు. దావూద్ పేరుతో హెచ్చరించడం కొన్ని సార్లు షూటర్లను బయటనుంచి బిహార్ నుంచి పిలిపించి బలవంతంగా ఇళ్లు, ఆస్తుల నుంచి ఖాళీ చేయించేవారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఇక్బాల్ కస్కర్, మరో ఇద్దరిని థానే కోర్టులో హాజరుపరచగా వారికి 8 రోజుల కస్టడీ విధించింది.