బలమైన భారత్‌ కోసం...

PM Modi inaugurates Netaji Subhas Chandra Bose Museum at Red Fort - Sakshi

సుభాష్‌ చంద్రబోస్‌ సంకల్పాన్ని నెరవేరుస్తాం

ఎర్రకోటలో 4 మ్యూజియంలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు. అలాగే జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్‌ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు.

ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్‌’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ఘనమైన భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించి నాలుగు మ్యూజియాలను ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. శక్తిమంతమైన భారత్‌ను నిర్మించాలన్న బోస్‌ సంకల్పాన్ని నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ మ్యూజియాన్ని సందర్శించే యువత నేతాజీ జీవితం నుంచి మరింతగా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా. ఎర్రకోటలోని ఈ గోడల్లో చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. వలసపాలకులు ఇక్కడే కల్నల్‌ ప్రేమ్‌ సెహగల్, కల్నల్‌ గుర్బ„Š  సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌లను విచారించారు’ అని ట్విట్టర్‌లో తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్‌ చంద్రబోస్‌ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్‌ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైని కుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్‌’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top