
బొమ్మనహళ్లి(కర్ణాటక): బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మంగళవారం ఖైదీలు ఒక్కసారిగా ధర్నాకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని, నాణ్యమైన ఆహారం అందటం లేదని ఖైదీలు ఆందోళన చేపట్టారు. దీంతో జైలు అధికారులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. తమను పెరోల్‌పై పంపటం లేదని, జైలులో తయారు చేస్తున్న ఆహారంలో నాణ్యత లేదని, బయట నుంచి కూడా ఆహారం తీసుకు వచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తున్నారు.
ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలు విరుద్దంగా అనేక వసతులు కల్పిస్తున్నారనే వదంతులు రావడంతో జైలులో ఆంక్షలు ఎక్కువయ్యాయని, కనీసం కుటుంబ సభ్యులను చూడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని వారు వాపోతున్నట్టు సమాచారం. మంగళవారం జైలుకు మానవ హక్కుల కమిషన్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఖైదీలు ధర్నాకు దిగినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఖైదీలు ఆందోళన అధికారులకు చెమటలు పట్టించింది.