ఆ డిపాజిట్లు అనుమానాస్పదం

ఆ డిపాజిట్లు అనుమానాస్పదం - Sakshi


‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ ప్రారంభించిన ఐటీ శాఖ

► 18 లక్షల మంది డిపాజిట్ల గుర్తింపు

► పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. వీరిలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్‌ చేసిన వారూ ఉన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ కోరుతూ ఐటీ అధికారులు వీరికి ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపనున్నారు. పది రోజుల్లోపు ఆన్ లైన్ లో వివరణ ఇవ్వకపోతే నోటీసులు, ఇతర చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఐటీ శాఖ మంగళవారం ‘ఆపరేషన్  క్లీన్  మనీ’(స్వచ్ఛ ధన్  అభియాన్ ) ప్రాజెక్టును ప్రారంభించింది. నవంబర్‌ 8 తర్వాత.. ఆదాయానికి మించిన నగదు డిపాజిట్లు చేసిన వారికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఎలక్ట్రానిక్‌ మెసేజీలు పంపుతుంది. వారు ఐటీ శాఖకు చెందిన ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌కు సమాధానాలు పంపాలి.


ఆపరేషన్ క్లీన్  మనీ ఒక ప్రోగ్రామింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అని, దీని ద్వారా డిపాజిటర్ల నుంచి సమాధానాలు రాబట్టి, అవసరమైతే చట్టపర చర్య తీసుకుంటామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనే జరుగుతుందని, అధికారులు భౌతికంగా ప్రశ్నించరని స్పష్టం చేశారు. తొలి దశ కింద రూ. 5 లక్షలు డిపాజిట్‌ చేసిన వారికి, రూ. 3–5 లక్షల మధ్య అనుమానాస్పద డిపాజిట్లు చేసినవారికి, సరైన పన్ను రిటర్నులు చూపని వారికి సమాచారం పంపుతున్నామని సీబీడీటీ చైర్మన్  సుశీల్‌ చంద్ర చెప్పారు. రూ.2 లక్షలకుపైగా డిపాజిట్‌ అయిన కోటి ఖాతాల వివరాలను సేకరించా మని, తొలిదశలో నవంబర్‌ 9–డిసెంబర్‌ 30 మధ్య పెద్ద మొత్తంలో డిపాజిట్‌ అయిన నగదు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు.


పన్నుచెల్లింపుదారుల సమాధానాలు సరిగ్గా ఉంటే తనిఖీ పూర్తయిపోతుందని, వారు ఐటీ ఆఫీసుకు రావాల్సిన అవసరముండదన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఐటీ శాఖ ఈ–పోర్టల్‌లో ఉన్నాయని, సమస్యలు ఉంటే 1800–4250–0025 నంబర్‌ను సంప్రదించాలని సీబీడీటీ తెలిపింది.25 కోట్ల ఆస్తుల అటాచ్‌

బెంగళూరు: నోట్ల రద్దు తర్వాత జరిగిన మనీల్యాండరింగ్‌కు సంబంధించి కర్ణాటక రాష్ట్ర హైవే అభివృద్ధి విభాగ మాజీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ అధికారి ఎస్‌సీ జయచంద్రకు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం అటాచ్‌ చేసింది. ఆస్తుల్లో సాగు భూములు, 13 ఇళ్లు ఉన్నాయి. డిసెంబర్‌ లో అరెస్టయిన జయచంద్ర ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.


డిసెం బర్‌లో జయచంద్ర ఇంటితోపాటు మరో ప్రభుత్వ సీనియర్‌ ఇంజనీర్‌ ఇంట్లో అధికారులు రూ. 5 కోట్ల నగదు, రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 20–35 శాతం కమీషన్  ఇచ్చి పాతనోట్లకు కొత్తనోట్లు తీసుకున్నారని ఈడీ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top