ముదుసలి మృత్యుపోరాటం

Old Lady In Critical Condition  - Sakshi

స్పందించని అధికారులు, గ్రామస్తులు

తిండి, వైద్యం లేక కుంగిపోయిన అభాగ్యురాలు

ముగ్గుబుట్ట వంటి తల..ముడుతలు పడిన శరీరం..లోతుకుపోయిన కళ్లు..శ్రమ పడేందుకు సహకరించని శరీరం..అండగా ఉండేందుకు ఎవరూ లేక ఓ వృద్ధురాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటువంటి దీన పరిస్థితిలో ఆ వృద్ధురాలి గాథను వినిపించుకునేదెవరు? ఆ అభాగ్యురాలి ఆవేదన ఎవరి హృదయాలను కదిలించగలదు. తిండి, వైద్యం లేకుండా మృత్యువుతో ఒంటరిగా పోరాడుతున్న ఆమె మొరను పట్టించుకునేదెవరు? సభ్య సమాజంలో ఒంటరిగా పోరాడుతున్న దీనురాలి దీనస్థితిని చూస్తున్నా మానవత్వం పరిమళించక పోవడం విచారకరం.

రాయగడ : రాయగడ జిల్లా కొల్నార సమితి కలియగుడ గ్రామంలో ఒక నిరుపేద వృద్ధురాలు కొద్దిరోజులుగా తిండి లేక తలకు గాయమైనప్పటికీ  వైద్యమందక సహాయం అందించేవారు లేక మృత్యువుతో పోరాడుతోంది. కలియగుడ గ్రామంలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ ఓ వృద్ధురాలికి తిండి లేక పొయ్యలో నిప్పు వెలగని పరిస్థితుల్లో కూడా సహాయం అందక ఉండగా తలకు గాయమైతే  ఏ ఒక్కరూ సహాయం అందించక పోవడమే కాకుండా కనీసం 108 అంబులెన్సు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆకలితో అలమటిస్తూ రోగగ్రస్థురాలై తన ఇంట్లో పొయ్యి దగ్గర నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది.

ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విచారకరం. గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఆమె నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడడం విచాకరం.  ఇటువంటి అభాగ్యులను ఆదుకునేందుకు సమితి అధికారులు, సర్పంచ్‌లు, సమితి మెంబర్లు, వార్డు మెంబర్లకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందిస్తున్నప్పటికీ ఓ వృద్ధురాలిని ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం విచారకరం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top