
మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మ్యాన్ చిత్రాలతో అలరించిన సురేష్ గోపీ.. ఇప్పడు కేంద్ర మంత్రి హోదాలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా తన గోడును చెప్పే క్రమంలో ఓ మహిళపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాస్త దురుసు వ్యాఖ్యలే చేశారాయన.
గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైక బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. త్రిసూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేష్ గోపీ, దాదాపు 75,000 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఇది బీజేపీకి కేరళలో తొలి లోక్‌సభ విజయం కావడం విశేషం. ఈ అర్హతతోనే ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కింది. అయితే..
అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతోనూ బిజీ బిజీగా ఉంటున్న ఆయన.. ప్రజా క్షేత్రంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి సురేశ్ గోపి ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో.. సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. కేంద్ర మంత్రిని కలిసిన ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కోరారు. అయితే..
ఆమె అలా మాట్లాడుతుండగానే ఆయన ఆపమంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘అక్కా.. ఎక్కువ మాట్లాడొద్దు. ఈ విషయంలో నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు’’ అంటూ మలయాళంలో కాస్త దురుసుగా చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన ఆ మహిళ.. ‘‘మీరు కూడా మా మంత్రే’’ అని మహిళ చెప్పగా.. ‘‘నేను దేశానికి మంత్రిని. ఇక్కడ సానుభూతిని ఆశించొద్దు. నేను ముక్కుసూటిగానే చెబుతున్నా’’ అని ఆయన బదులిచ్చారు. ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై వృద్ధురాలు ఆనందవల్లి మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని, ఆయన కఠువుగా మాట్లాడకుండా.. తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేది కదా అని వాపోయారు.
ఇదిలా ఉంటే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఆయన తిరస్కరించడంపై ఈ మధ్యే విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనని.. తన పరిధిలో అంశాలను మాత్రమే పరిష్కరించగలనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారాయన.